`చలో ఆత్మకూరు'తో పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత  

చలో ఆత్మకూరు పేరుతో టిడిపి, వైసిపి తలపెట్టిన పోటాపోటీ కార్యక్రమంతో గుంటూరు జిల్లాలోను, ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని టిడిపి చెబుతుండగా, తాము టిడిపి బాధితులతో సేవ్‌ పల్నాడు పేరుతో చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తామని వైసిపి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రకటించారు. బుధవారం అనుసరించాల్సిన ఎత్తుగడలపై టిడిపి, వైసిపి గుంటూరు కేంద్రంగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. దీంతో జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. 

గుంటూరు నుంచి పల్నాడుకు వెళ్లే వివిధ మార్గాల్లో పోలీసులు పికెట్‌లు ఏర్పాటు చేశారు. గుంటూరులో చంద్రబాబు బసచేసిన టిడిపి రాష్ట్ర కార్యాలయం, వైసిపి బాధితుల శిబిరం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పల్నాడు ప్రాంతమంతా నివురుగప్పిన నిప్పులా మారింది. పల్నాడు ప్రాంతంతోపాటు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, బాపట్ల డివిజన్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. నరసరావుపేట పరిధిలో పలువురు టిడిపి నేతలకు పోలీసులు నోటీసు లిచ్చారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని తెలిపారు. పలువురిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. 

ఇరు పార్టీలూ తమకు అనుమతివ్వాలని ఐజి కుమార విశ్వజిత్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. కార్యక్రమ సన్నాహకంలో భాగంగా గుంటూరు పునరావాస శిబిరంలో ఉన్న బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులను వారి గ్రామాలకు చేరుస్తామని, కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టిడిపి నేతలపై కేసులు పెడుతున్న పోలీసులపై ప్రైవేటు కేసులు దాఖలు చేసే అంశంపై టిడిపి న్యాయవిభాగంతో చంద్రబాబు చర్చించారు. 

బుధవారం ఉదయం జిల్లా నాయకత్వం మొత్తం గుంటూరులోని పునరావాస శిబిరానికి రావాలని చంద్రబాబు కోరారు. వారందరితో ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు చలోఆత్మకూరు రూట్‌మ్యాపును టిడిపి విడుదల చేసింది. 

ఉదయం ఎనిమిది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు అరండల్‌పేటలో పునరావాస కేంద్రానికి చేరుకుంటారు. 9.15 గంటలకు శిబిరం నుంచి రోడ్డుమార్గంలో ఆత్మకూరుకు 11.45 గంటలకు చేరుకుంటారు. వైసిపి ప్రజాప్రతినిధులు ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు పార్టీ ఆఫీసు నుంచి బయల్దేరి వారు కూడా అదే సమయానికి ఆత్మకూరు వెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

కాగా, పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని, ఏ విధమైన ఊరే గింపులకు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని డిజిపి గౌతం సవాంగ్‌ తెలిపారు. ప్రజలు వినాయక చవితి, మొహరం పండుగలను ప్రశాంతంగా జరుపు కుంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిం చొద్దని పేర్కొన్నారు. 

ఎన్నికల తరువాత గ్రామాల్లో ఏర్పడే చిన్న వివాదాలను పెద్దఎత్తున ప్రచారం చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గోరంతలను కొండతలుగా చూపుతూ రాష్ట్రంలో అలజడి రేపుతున్నారని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఎంపిలు కృష్ణదేవరాయులు, నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూడు నెలలుగా పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. వర్షాలు కురిసి, వరదలు వచ్చి పంటలు పండించేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు బిజీగా ఉన్న తరుణంలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని, హత్యారాజకీయాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. 

మరోవంక, వంద రోజుల కాలంలో టిడిపి నాయకులపై వైసిపి నాయకులు చేసిన దాడులతో కూడిన సుమారు 87 పేజీలతోనూ, చలో ఆత్మకూరు కార్యక్రమంపై 36 పేజీలతో రూపొందించిన రెండు పుస్తకాలను టిడిపి అధినేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం గుంటూరులో విడుదల చేశారు.

జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, టిడిపి కార్యకర్తలపై 600 చోట్ల దాడు లు జరిగాయని తెలిపారు. దాడులను తాము అడ్డుకుంటామని, రాజకీయ దాడుల బాధితులకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడి యాలో కామెంటు చేస్తే మహిళలని కూడా చూడకుండా నీచమైన పోస్టులు పెడు తున్నారని విమర్శించారు. వీటన్నిటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.