గర్వర్నర్లలో అతిపిన్న తమిళిసై, పెద్దవారు హరిచందన్   

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా రికార్డు నమోదు చేసుకున్న తమిళిసై సౌందరరాజన్.. మరో రికార్డును కూడా తన సొంతం చేసుకున్నారు. దేశంలోని గవర్నర్లు అందరిలో ఆమే పిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆమె వయస్సు 58 ఏండ్లు. ప్రస్తుత గవర్నర్లలో ఇంకా ఆరుపదుల వయస్సులోకి ప్రవేశించని ఏకైక గవర్నర్ కూడా ఆమే. 

కాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వయస్సులో అందరికంటే పెద్దవారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీటాండన్ (84) పెద్దవయస్కులలో రెండోవారు. గుజరాత్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆచార్య దేవవ్రత్ పిన్నవయస్కులలో రెండోవ్యక్తి. తమిళిసై కంటే ఆయన రెండేండ్లు పెద్దవారు. దేశంలోని గవర్నర్ల సగటు వయస్సు 73 ఏండ్లు. దేశంలోని 28 మంది గవర్నర్లలో అత్యధికుల వయస్సు 70 నుంచి 79 ఏండ్ల మధ్య ఉండటం గమనార్హం. 

60 నుంచి 70 ఏండ్ల మధ్య వయస్కులు ఏడుగురు, 70 నుంచి 80 ఏండ్ల మధ్య వయస్కులు 14 మంది ఉండగా 80 ఏండ్లు నిండినవారు ఆరుగురు ఉన్నారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖీ (76) మిజోరం గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 మంది గవర్నర్లు మొదటిసారిగా ఆ హోదాను పొందగా.. తొమ్మిదిమంది ఇంతకుముందు వివిధ రాష్ర్టాల్లో గవర్నర్లుగా పనిచేసిన అనుభవం గడించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం ఆరుగురు మహిళా గవర్నర్లు ఉన్నారు.