పాక్ ఆరోపణలకు ధీటుగా భారత్ సమాధానం 

జమ్ముకశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ) సదస్సులో పాకిస్థాన్ చేసిన ఆరోపణలకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై తాము తీసుకున్నది సార్వభౌమ నిర్ణయమని, దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్సీ 42వ వార్షిక సదస్సులో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.

యూఎన్‌హెచ్‌ఆర్సీలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) విజయ్ ఠాకూర్ సింగ్ మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం (పాక్) ఇతరుల గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి సహకారాన్ని అందిస్తున్న ఒక దేశం (పాకిస్థాన్) అసత్య ఆరోపణలు చేస్తున్నదని, మానవ హక్కుల ముసుగులో విషపూరిత రాజకీయ ఎజెండాను తెరపైకి తీసుకొస్తున్నదని నిప్పులు చెరిగారు. 

అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై దర్యాప్తును చేపట్టాలని యూఎన్‌హెచ్‌ఆర్సీని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. కశ్మీర్‌లో విధించిన కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల నిలిపివేతను వెంటనే ఎత్తివేస్తూ.. అక్కడి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా భారత్‌కు సూచించాలని విజ్ఞప్తి చేశారు. అయితే యూఎన్‌హెచ్‌ఆర్సీకి పాక్ చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది.

కాగా, కశ్మీర్ అంశం మీద ఏకపక్ష నిర్ణయం తీసుకోరాదని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా, పాకిస్థాన్ సంయుక్త ప్రకటన చేయడంపై భారత్ అభ్యంతరం వ్యక్తంచేసింది. భారత్‌లో జమ్ముకశ్మీర్ అంతర్భాగం అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ స్పష్టం చేశారు. భారత్ భూభాగంలో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలో చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.