తాజాగా డీకే శివకుమార్‌ కుమార్తెకు సమన్లు 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్యకు సమన్లు జారీచేశారు. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఐశ్వర్యకు సమన్లు జారీ చేసినట్టు సీనియర్‌ ఈడీ అధికారి ఒకరు తెలిపారు. 

శివకుమార్‌ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న సమయంలో ఈడీ అధికారులు.. ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఒక ట్రస్టుకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 

అంతేకాకుండా 2017 జూలైలో శివకుమార్‌, ఆయన కుమార్తె కలిసి ఒక బిజినెస్‌ డీల్‌ కోసం సింగపూర్‌ వెళ్లడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి శివకుమార్‌కు సన్నిహితుడైన సచిన్‌ నారాయణ్‌ విచారించారు.  మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన శివకుమార్‌ను సెప్టెంబర్‌ 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.