శాంతి, సహజీవనంలకు ప్రతీక బోహ్రా ముస్లింలు

శాంతి, సహజీవనం అనే ఉదాత్తమైన సందేశాలను ప్రపంచానికి బోహ్రా ముస్లింలు చాటుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. భారత సంస్కృతిలో వసుధైక కుటుంబం భాగమని, బోహ్రా ముస్లింలు ఈ భావనను అందిపుచ్చుకుని అమలు చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. వసుధైక కుటుంబం అనే భావన ప్రాచీన భారతీతత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇండోర్ లో బోహ్రా ముస్లింలు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సైఫీ మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి సైదానా మఫ్తాద్దాల్ సైఫుద్దీన్ అనే ఆధ్యాత్మిక వేత్త పాల్గొన్నారు. షియా ముస్లింలలో బోహ్రా ముస్లింలు ఒక తెగ. వీరు ఎక్కువగా వాణిజ్య రంగంలో ఉ టారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీని బోహ్రా ముస్లింల ఆధ్యాత్మికవేత్త సైఫుద్దీన్ సత్కరించారు.

బోహ్రా ముస్లింల కార్యక్రమంలో పాల్గొన్న మొదటి ప్రధాని మోడీ కావడం విశేషం కాగా, వారి ఆధ్యాత్మికవేత్త సైఫుద్దీన్ ను కలవడం కుడా మొదటి సారి. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి నివాళులు అర్పిస్తూ, ఆషారా ముబారాకా అనే కార్యక్రమాన్ని బోరా ముస్లింలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ గతం ఎంతో విశిష్టమైంది. అద్భుతమైన భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్తక రంగంలో నిజాయితీతో కూడిన వ్యాపారం చేయడంలో బోహ్రాలు ముందుంటారని కొనియాడారు. కొంత మంది వర్తకులు వ్యాపారంలో మోసాలకు పాల్పడుతుంటారని, అందుకనే దేశంలో వర్తకుల లావాదేవీలకు సంబంధించిన పన్నులను ప్రక్షాళన చేసి జీఎస్‌టీ ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. జీఎస్‌టీ, దివాలా ప్రక్రియ చట్టానికి పెద్ద ఎత్తున వర్తకులు, వాణిజ్యవేత్తలు మద్దతు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసారు.

మహాత్మాగాంధీకి బోహ్రా ముస్లింలతో ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. సైదనా మహమ్మద్ బుర్హనుద్దీన్ అనే మత పెద్ద గాంధీకి చేరువైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. దండి మార్చిలో కూడా బుర్దనుద్దీన్ నేతృత్వంలో బోహ్రా ముస్లింలు పాల్గొన్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ అంటే విదేశీపెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని, పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు పెట్టుబడులు మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారని ప్రధాని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల ఇక్కడే మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇతర వాణిజ్య ఉత్పత్తుల తయారీ పెరిగిందని చెప్పారు.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఎనిమిది శాతం నమోదైందని గుర్తు చేసారు.  వృద్ధిరేటు అంకెల్లో ఉండేందుకు చేరుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.  వైద్య రంగం, పౌష్టికాహారం అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఔషధాల ధరలు కూడా గణనీయంగా తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో 50 కోట్ల మందికి ఆయూష్మాన్ భారత్ స్కీంకు మంచి ఆదరణ లభిస్తోందని హామీ ఇచ్చారు.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ పాల్గొన్నారు.