కాంగ్రెస్ కు నటి ఊర్మిళ మటోండ్కర్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమున్నత లక్ష్యం కోసం ముంబై కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఇష్టం లేనందున తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఊర్మిళ తెలిపారు.

గత ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసిన ఊర్మిళ, బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రాజకీయాల నుంచి ఆమె వైదొలుగుతున్నారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే, ఆ వార్తలను ఆమె వెంటనే ఖండించారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ మంచి పోరాటం చేశానని, ఆత్మసాక్షిగా, ఎంతో గౌరవంతో ఈ ఎన్నికల్లో శ్రమించానని, ఇంకెంతో నేర్చుకున్నానని, రాజకీయాలు వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు.