పాక్‌లో హింసకు గురవుతున్న హిందువులు, సిక్కులు 

పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన హిందువులు, సిక్కులను హింసిస్తున్నారని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ లో మైనారిటీలే కాకుండా ముస్లిములు కూడా సురక్షితంగా లేరని, వారు కూడా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని బల్దేవ్ కుమార్ వెల్లడించారు. 

పాకిస్థాన్ దేశంలో తాము పలు కష్టాలు పడ్డామని, భారత ప్రభుత్వం తనకు ఆశ్రయం కల్పిస్తే తాను మళ్లీ పాకిస్థాన్ కు వెళ్లనని బల్దేవ్ కుమార్ చెప్పారు. పాక్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖవా పరిధిలోని బారికట్ మాజీ ఎమ్మెల్యే అయిన బల్దేవ్ కుమార్ తన కుటుంబానికి భారత్ ఆశ్రయం ఇవ్వాలని కోరారు. పాకిస్థాన్ లో ఉన్న హిందువులు, సిక్కులు హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం బల్దేవ్‌ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. అంతకు ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని,  అందువల్లే తన కుటుంబాన్ని పాక్‌ నుంచి ఇండియాకు పంపిచాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్‌ వెళ్లాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. 

నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్‌ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తమ కుటుంబాలు పాక్ నుంచి భారతదేశానికి తిరిగివచ్చేందుకు వీలుగా భారత సర్కారు ప్యాకేజీని ప్రకటించాలని ఆయన కోరారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ ఏదైనా చేయాలని బల్దేవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 

పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, క్రైస్తవ బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ముస్లిమ్ యువకులు పెళ్లాడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయని బల్దేవ్ కుమార్ చెప్పారు. నంకాన సాహిబ్ వద్ద ఓ సిక్కు బాలికను బలవంతంగా మతం మార్చి ముస్లిమ్ యువకుడు పెళ్లాడిన ఘటన తాజాగా వెలుగుచూసిందని, ఇదీ పాక్ అరాచకానికి నిదర్శనమని పాక్ మాజీ ఎమ్మెల్యే వివరించారు.