కోనసీమలో జలదిగ్బంధనంలో లంక గ్రామాలు 

గోదావరి ఉదృతి క్రమంగా పెరుగుతుండటంతో కోనసీమ పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి. వరద ఉదృతి  పెరగడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చే వారికి ఇబ్బందులు పెరిగాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో గోదావరి తీరంలోని లంక గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారింది. 

లంకల్లో పంట పొలాలున్న వారు, పాడిపశువులున్నవారు వెళ్లటానికి మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమలో భాగమైన ఆచంట మండలం పరిధిలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, గ్రామాల వద్ద గంట గంటకూ గోదావరి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అత్యవసర వస్తువులు కావాలన్నా గోదావరి దాటి రావాల్సి ఉండటంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. 

గోదావరిని దాటి రావాలంటే వీరికి నాటు పడవలే దిక్కు. గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా గోదావరిలో పడవలు తిరగకుండా రాకపోకలు నిషేధించటంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

పి.గన్నవరం మండలం, జి.పెదపూడి, కె.ఏనుగుపల్లిలంక, శివాయిలంక కాజ్‌వేలు వరద నీటిలో ముంపు బారినపడ్డాయి. లంక భూముల్లోని పలు పంటలు ముంపుబారిన పడ్డాయి. రాజోలు మండలం సొంపల్లి పుష్కరాల రేవు వరద నీటితో మునిగిపోయింది. సొంపల్లి- దొడ్డిపట్ల రేవు రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలు నున్న వారి బాడవ, కాటన్‌ పార్క్‌, కైలాస భూమి జల దిగ్బంధం లో ఉన్నాయి. 

సఖినేటిపల్లి లంక కాజ్‌ వే, అప్పానిరాములంక కాజ్‌ వేలు పూర్తిగా నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సఖినేటిపల్లి మండలం పెదలంక, అప్పనిరాములంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల చూట్టూ వరద నీరు చేరడంతో ఇబ్బందులు అధికమయ్యాయి. అత్యవసర పనులు ఉన్నవారు మోకాళ్ల లోతు నీళ్లలో నుంచి నడుచుకుంటూ ప్రమాదకర స్థితిలో కాజ్‌వే దాడుతున్నారు. వీటితో పాటు ఉభయ గోదావరి జిల్లాల సఖినేటిపల్లి- నరసాపురం రేవు లోకి వరద నీరు పొటెత్తడంతో పంటు ప్రయాణం నిలిపివేశారు. 

దీంతో నరసాపురం వెళ్లే ప్రయాణికులు, ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో చించినాడ బ్రిడ్జ్‌ మీద నుండి ప్రయాణం సాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరుకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. కేవలం ఆశా వర్కర్లతో ఆరోగ్య కేంద్రాలు ఎర్పాటు చేశారే తప్ప బాధితులకు ఆహరం, తాగు నీరు అందించడం వంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. 

నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో బాధితులు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.