సహకార ఎన్నికలు జరిపే ధైర్యం లేని జగన్ 

సహకార రంగంలో ఎన్నికలు జరిపే ధైర్యం కూడా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలేనని ధ్వజమెత్తారు. జగన్‌ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. 

చాలా త్వరగా పరిపాలనపై జగన్‌ పట్టు కోల్పోయారని కన్నా విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు మూలన పడే పరిస్థితి రావడానికి కారణం.. మీ నిర్ణయాలు కాదా? అని నిలదీశారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారిచ్చారని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని కన్నా విమర్శించారు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదని ధ్వజమెత్తారు. 

అవినీతిపరులను వదిలేసి రేషన్‌ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై జగన్ తమ ప్రతాపం చూపిస్తున్నారని కన్నా మండిపడ్డారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువమందిని రోడ్డున పడేశారని ఎద్దేవా చేశారు. రోజురోజుకు అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతూ ఈ 3 నెలల్లో మీ అవగాహనా రాహిత్యం ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుందని.. మత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కన్నా విమర్శించారు.

ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి.. కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేశారని ఆరోపించారు. ఇసుక పాలసీకి సెప్టెంబర్‌ 5న ముహూర్తం పెట్టారని, కార్మికులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వరదలు వస్తే జగన్‌ అమెరికాలో కూర్చున్నారని కన్నా దుయ్యబట్టారు. 

ప్రజలు మంచి మార్పు కోరుకొని జగన్‌కు అవకాశం ఇచ్చారని కానీ ఆయన గత ఐదేళ్ల సంగతే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కానీ.. ప్రస్తుతం ఏంటనేది చెప్పరే అని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరు మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొస్తున్నారని కన్నా విమర్శించారు. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థ అదని ఆరోపించారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని కన్నా విమర్శించారు.