బెల్లీ డ్యాన్సులతో ఇన్వెస్టర్లకు పాక్ గాలం!

అప్పుల ఊబిలో ఇరుక్కన్న ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేసింది. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు అజర్‌బైజాన్ రాజధాని బకాలో జరిగిన సర్హద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో అందమైన బెల్లీ డ్యాన్సర్ల చేత అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించడం వివాదాస్పదమైంది. 

పెట్టుబడిదారుల సదస్సులో బెల్లీ డ్యాన్సర్ల నృత్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో పాక్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ దుర్భర ఆర్థిక పరిస్థితికి ఈ వీడియో అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక పరిస్థితిని ఒడ్డున పడేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త దారులు వెతుకుతోందంటూ కొందరు విమర్శించారు. విదేశీ ఇన్వెస్టెర్లను ఆకట్టుకోవడానికి బెల్లీ డ్యాన్సర్లతో డ్యాన్సులు చేయించారు..ఇక మిగిలిందేమిటి అంటూ పాకిస్తానీ స్థానిక మీడియా సైట్లలోనే పాకిస్తాన్ పౌరులు ప్రశ్నించడం విశేషం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారితే నగ్న నృత్యాలకు కూడా తెగిస్తారేమో అంటూ మరో నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 

ఒక పక్క భారతదేశం చంద్రయాన్-2 వంటి ప్రయోగాలతో ముందుకు దూసుకెళుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇన్వెస్టెర్లను ఆకట్టుకునేందుకు బెల్లీ డ్యాన్సులు నిర్వహించడం సిగ్గుచేటంటూ మరో ట్విట్టరైట్ విమర్శించాడు. గత జులైలోనే అప్పుల ఊబిలో నుంచి పాక్‌ను గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) 600 కోట్ల డాలర్ల రుణాన్ని మూడేళ్ల కాలానికి అందచేయడానికి అంగీకరించింది.