22వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సిఎం కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకు జరపాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీష్‌రావు శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బిఏసి) సమావేశమయ్యింది. 

14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా ఈ సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీ వరకు సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని సమాచారం.

బిఎసి సమావేశం అనంతరం శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ టి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సూచించిన విధంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ కాన్సిస్టూషనల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టాలని సిఎం కెసిఆర్ సూచించారని ఆయన తెలిపారు. 

ఈనెల 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ చర్చపై 15, 16వ తేదీన సిఎం కెసిఆర్ సమాధానం ఇస్తారని, ఈనెల 17వ తేదీ నుంచి పద్దులపై అసెంబ్లీలో చర్చ, 22వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

శాసనమండలిలో ఈనెల 14న రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుండగా, 15వ తేదీన బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ మేరకు బిఏసి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 10న మండలికి సెలవు కావడంతో 11వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. మళ్లీ 12, 13వ తేదీల్లో సెలవులుగా స్పీకర్ పేర్కొనడంతో 14న బడ్జెట్‌పై చర్చ, 15న ప్రభుత్వం సమాధానం ఉంటుంది. ఈనెల 14వ తేదీ నుంచి 22వరకు మండలి సమావేశాలు జరగనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.