అసోంలోనే కాదు, దేశంలో ఎక్కడున్నా వారిని వదలం  

చొరబాటుదారుల నుంచి యావద్దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అది కేవలం అసోంకే పరిమితం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సోమవారం గౌహతిలో  జరిగిన 'నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్' (ఎన్‌ఈడీఏ) సమావేశంలో అమిత్‌షా మాట్లాడూతూ, ఎన్ఆర్‌సీపై అసోంలేనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయని చెప్పారు. 

ఎక్కువ మందిని ఎన్‌ఆర్‌సీ నుంచి తప్పిస్తారని కొందరు అభిప్రాయపడుతుంటే, ఎన్‌ఆర్‌సీ నుంచి తప్పించిన జనం తమ రాష్ట్రాలకు వచ్చి చేరుతారని చిన్న రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోందని తెలిపారు. అయితే చొరబాటుదారులెవరూ అసోంలో జీవనం సాగించడం కుదరదని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించడం కూడా సాధ్యం కాదని అమిత్‌షా స్పష్టం చేశారు. అసోం నుంచే కాకుండా దేశంలో ఎక్కడా చొరబాటుదారులకు చోటుండదని, యావద్దేశానికి చొరబాటుదారుల నుంచి విముక్తి కల్పిస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చారు. 

బీజేపీ సారథ్యంలోని భాగస్వామ్య పార్టీల కూటమి 'ఎన్‌ఈడీఏ'పై అమిత్‌షా మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక-సాంస్కృతిక అస్థిత్వానికి ఇది ప్రతీక అని అన్నారు. 'ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికీ ఎన్డీయే చేరువ కావాలంటే ఎన్‌ఈడీఏ అవసరం మనకు ఉంది. 2016లో ఎన్‌ఈడీఏ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడది చాలా పెద్దదైంది. నేను నాగాల్యాండ్ వెళ్లినప్పుడు నార్త్ ఈస్ట్ విముక్త కాంగ్రెస్ అవసరం గురించి చెప్పాను. ఇప్పుడది వాస్తవరూపం దాల్చింది. ఈశాన్యం మొత్తం ఎన్‌ఈడీఏ కిందకు వచ్చింది. 8 రాష్ట్రాలు కూడా ఎన్‌ఈడీఏలో ఉన్నాయి' అని అమిత్‌షా వెల్లడించారు.