రహస్యంగా మసూద్‌ అజహర్‌ను విడిచిపెట్టిన పాక్

పాకిస్థాన్ మరో సరికొత్త కుట్రకు తెరలేపినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తాజా సమాచారం. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను పాక్ 'రహస్యం'గా విడుదల చేసినట్టు ఐబీ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా అప్రమత్తం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు నిర్వహించేందుకే ఆయనను రహస్యంగా విడిచిపెట్టారని, రాజస్థాన్ సమీపంలోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద అదనపు బలగాలను సైతం పాక్ మోహరించిందని ఆ వర్గాలు సమాచారం ఇచ్చాయి. 

ఐబీకి చెందిన ఇద్దరు అధికారుల తాజా సమాచారం ప్రకారం, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసినందుకు ప్రతీకారంగా రాబోయే రోజుల్లో సియల్‌కోట్-జమ్మూ, రాజస్థాన్ సెక్టార్లలో 'భారీ దాడి'కి పాకిస్థాన్‌ ముమ్మర వ్యూహరచన చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రాజస్థాన్ సరిహద్దుల సమీపంలో పాకిస్థాన్ అదనపు బలగాల మోహరింపును ప్రారంభించింది. 

జమ్మూకశ్మీర్‌లో ఇండియా చర్యలకు ప్రతిగా 'పూర్తిస్థాయిలో దీటైన జవాబు' ఇస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత శుక్రవారం హెచ్చరించడం, కశ్మీరీ సోదరుల కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా దీనికి ముందు హెచ్చరించిన నేపథ్యంలో మసూద్ అజహర్ రహస్యంగా విడుదల చేసినట్టు ఐబీ వర్గాలు చెబుతున్నాయి.