రూ. 1,46, 492 కోట్లతో  తెలంగాణ వార్షిక బడ్జెట్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం అసెంబ్లీలో. 2019-20 సంవత్సరానికి 1,46,492 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం: రూ. 1,11,055 కోట్లుకాగా, మూలధన వ్యయం: రూ. 17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు: రూ. 2,044.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు: రూ. 24,081.74 కోట్లుగా చూపారు. 

బడ్జెట్ లో ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు; రైతు బీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ. 1137 కోట్లు; పంట రుణాల మాఫీ కోసం రూ. 6000 కోట్లు; 

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ. 8000 కోట్లు కేటాయింపు; మున్సిపాలిటీలకు రూ. 1764 కోట్లు; రైతు బంధు పథకానికి రూ. 12000 కోట్లు; ఆసరా పెన్షన్ల కోసం రూ. 9402 కోట్లు కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్ల ఖర్చు చేస్తామని తెలిపారు. 

రాష్ట్ర సంపద విలువ రూ. 8,65,688 కోట్లుగా నమోదైందని చెబుతూ మునిసిపాలిటీలకు రూ. 1,714 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపులు చూపారు. అత్యంత జాగ్రత్తతో 2019-20 బడ్జెట్‌ను రూపొందించామని, ఐదేళ్లలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అయిందని వెల్లడించారు. 

ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి  తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ యధాతథంగా కొనసాగిస్తామన్నారు. పేదలకు అందించే ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానివ్వమని కెసిఆర్ స్పష్టం చేశారు.

ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెట్టింపు చేశామన్నారు. వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించామని, త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. బిడి కార్మికుల పిఎఫ్ కటాఫ్ డేట్ కూడా ప్రభుత్వం తొలగించిందన్నారు.

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరిగాయని, కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమలు చేస్తామని, ప్రభుత్వం ఇటీవలే కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చిందని, కొత్త రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్, కొత్త మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నత స్థాయి సేవలు అందాలనేదే ప్రభుత్వం ఆశయమని తెలిపారు.

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని, ప్రణాళిక బద్ధమైన ప్రగతి పట్టణాలు తయారు కావాలని, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం లభించాలని ప్రభుత్వం ఆశిస్తోందని కెసిఆర్ పేర్కొన్నారు.