సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధంకై ప్రధాని పిలుపు 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్ర‌పంచ‌దేశాలు కూడా సింగిల్ యూజ్(వాడి ప‌డేసే) ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్సాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని పిలుపిచ్చారు. 

కంబాట్ డిస‌ర్టిఫికేష‌న్ అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వ‌ర్యంలో  ఢిల్లీలో జరిగిన  కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ(సీఓపీ14) స‌ద‌స్సులో ప్రసంగిస్తూ సీఓపీ14 ల‌క్ష్యాల కోసం భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. భూమి, జీవ‌వైవిధ్యంపై వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణం ప్ర‌భావం చూపుతాయ‌ని గుర్తు చేశారు. ప్ర‌పంచ దేశాల‌న్నీ వాతావ‌ర‌ణ మార్పు ప్ర‌భావాల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని పేర్కొన్నారు.

దీని వ‌ల్ల సార‌వంత‌మైన నేల కూడా త‌గ్గుతోంద‌ని చెప్పారు. స‌ముద్ర ప్రాంతాల్లో నీటిమ‌ట్టం పెర‌గ‌డం, అస్థిర వ‌ర్షాలు, ఇసుక తుఫాన్లు, వేడి వాతావ‌ర‌ణం లాంటి అంశాలు కూడా దీకిని కార‌ణ‌మ‌ని తెలిపారు. భూసారం త‌గ్గ‌కుండా ఉండాలంటే.. నీటిని ఒడిసిప‌ట్టుకోవాల‌ని సూచించారు. భూమిలో తేమ‌ను కాపాడుకుంటేనే నేల స‌జీవంగా ఉంటుంద‌ని చెప్పారు. 

భార‌త్‌లో గ‌త కొన్నేళ్ల‌లో వృక్షాల సంఖ్య పెరిగింద‌ని, ఇది సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని మోదీ తెలిపారు. 2015 నుంచి 2017 మ‌ధ్య వృక్షాల పెరుగుద‌ల 0.8 మిలియ‌న్ హెక్టార్లుగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 2030లోగా సుమారు 26 మిలియ‌న్ల హెక్టార్ల నేల‌ను మ‌ళ్లీ సార‌వంతం చేస్తామని ప్రకటించారు.