మంత్రి పదవి ఇస్తానని మాటతప్పిన కేసీఆర్  

తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట ఈటల రాజేందర్, తర్వాత రసమయి బాలకిషన్... తాజాగా నాయని తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. 

ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే ‘కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా’ అని కేసీఆరే అన్నారని నాయిని వెల్లడించారు. 

అంతేకాకుండా తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపై నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని నాయిని తన అసంతృప్తిని వెళ్లగక్కారు. 

సీఎం కేసీఆర్ తమ ఇంటికి పెద్ద అని, తామంతా ఓనర్లమేనని స్పష్టం చేశారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయిని అంటూ ఎద్దేవా చేశారు.   

 కాగా, తాజా కేబినెట్ కూర్పుపై మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య అన్నారు.