సవాళ్లనే సవాల్ చేసే పటిమతో వంద రోజులు   

తాము రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి వంద రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘సవాళ్లనే సవాల్ చేసే పటిమతో భారత్ ముందుకు సాగుతోంది’ అని మోదీ ఉద్ఘాటించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన వ్యవసాయ రంగం నుంచి జాతీయ భద్రత వరకు అనేక రంగాల్లో తాము తీసుకున్న కీలక నిర్ణయాలకు 130 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన మద్దతే స్ఫూర్తి అని పేర్కొన్నారు. 

సవాళ్లను ముఖాముఖి ఢీకొని, లక్ష్యాలను సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తమకు తెలుసునని భరోసా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. గత 60 ఏండ్లలో ఇలా బిల్లులు ఆమోదం పొందిన సందర్భాలు లేవు. అలాగే ఈ వంద రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. దేశాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు అని తెలిపారు.

అభివృద్ధి, విశ్వసనీయత, భారీ ఎత్తున జరిగిన మార్పులు, సంస్కరణలు తమ ప్రభుత్వ వంద రోజుల పాలనలో గీటురాళ్లని ప్రధాని  పేర్కొన్నారు.  లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేకపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, వాటిని ఢీకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగిందని మోదీ తెలిపారు. ఈ వంద రోజుల పాలనలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలను ప్రపంచ దేశాలన్నీ గమనించాయని చెప్పారు. 

ఈ వంద రోజుల్లోనే తమ ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని, అంకితభావంతో సదుద్దేశ్యంతోనే నిర్దేశిత లక్ష్యాల సాధనకు పురోగమించిందని మోదీ వెల్లడించారు. ముస్లిం మహిళలకు రక్షణ, ఉగ్రవాద నిరోధన సహా ఇటీవలకాలంలో ఎన్నో కీలక చట్టాలను తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసే లక్ష్యంతో వివిధ రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ మ్యాప్‌ను కూడా రూపొందించామని ఆయన తెలిపారు. అలాగే బ్యాంకింగ్ రంగానికి కొత్త శక్తిని అందించేందుకు చారిత్రక రీతిలోనే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని  వివరించారు. 

‘సవాళ్లను ఎలా ఢీకొనాలో మాకు తెలుసు. జమ్మూకాశ్మీర్ అయినా లేదా జల సంక్షోభం అయినా 130 మంది కోట్ల మంది ప్రజలు కొత్త పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతున్నాం’ అని మోదీ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత పేద ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమేనని మోదీ తెలిపారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. 

తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది పాక్షికంగా ఉండదని, పరిపూర్ణ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగాన్ని సమగ్ర రీతిలో పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించిందని, ప్రతిఒక్కరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తోందని ఆయన తెలిపారు.

స్వచ్ఛ భారత్, యోగా, ఉజ్వల, ఆయుర్వేద, ఫిట్ ఇండియా ఉద్యమాల వల్ల ప్రజారోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా రోగాలను నియంత్రించడమూ సాధ్యమవుతోందని తెలిపారు. 2024 నాటికి పైపుల ద్వారా దేశంలోని ప్రతి ఇంటికీ నీటిని అందించాలన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఇందుకోసం రూ 3.50 లక్షల కోట్లు   ఖర్చు చేస్తామని మోదీ తెలిపారు. జల సంరక్షణలో ప్రతిఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని, అతి తక్కువ వ్యవధిలోనే ఈ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 21 వేల కోట్ల రూపాయలను జమ చేశామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్తకులు, చిన్నవ్యాపారుల పెన్షన్ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే దిశగా కూడా తమ ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తోందని తెలిపారు.