చంద్రయాన్-2 ప్రయోగంపై  నాసా అభినందనలు 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం పరిపూర్ణం కాకపోయినప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రశంసల జల్లు కురిపించింది. ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థలో పరిశోధనలు సాగించేందుకు ఆసక్తి చూపుతున్న నాసా.. చంద్రయాన్-2 ప్రయోగం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నది. 

అంతరిక్షంలో ప్రవేశించడం చాలా కష్టమైన పని. ఇప్పటివరకూ ఎవరూ కాలుమోపని చంద్రుని దక్షిణధ్రువ ఉపరితలంపై చంద్రయాన్-2ను దించేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాన్ని మేము ప్రశంసిస్తున్నాం. మీ ప్రయాణంతో మాలో స్ఫూర్తి నింపారు. మున్ముందు మీతో కలిసి సౌర వ్యవస్థను అన్వేషించేందుకు ఎదురుచూస్తున్నాం అని ట్వీట్ చేసింది. 

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి కూడా చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రశంసించారు. చంద్రయాన్-2 ప్రయోగం కోసం అద్భుతంగా ప్రయత్నించిన ఇస్రోను అభినందిస్తున్నాం. ఈ ప్రయోగం భారత్‌కు గొప్ప ముందడుగు. వైజ్ఞానిక విజయాలకు దోహదపడే ఎంతో విలువైన సమాచారాన్ని ఈ ప్రయోగం అందిస్తుంది అని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలశాఖ తాత్కాలిక సహాయ మంత్రి అలైస్ జీ వెల్స్ ట్వీట్ చేశారు.