ఆర్థిక మంత్రిగా హరీశ్, మున్సిపల్, ఐటీ మంత్రిగా కేటీఆర్  

రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి పదవులకు దూరంగా ఉంచిన మేనల్లుడు హరీష్ రావు, కొడుకు కె టి రామారావు లను చంద్రశేఖరరావు తిరిగి తొమ్మిది నెలల అనంతరం మంత్రివర్గంలోకి తీసుకొని, వారికి కీలకమైన శాఖలను అప్పచెప్పారు. మొత్తం ప్రభుత్వం, పార్టీలపై కొడుకుకు ఆధిపత్యం కల్పించడం కోసం హరీష్ రావు ను జిల్లాకే పరిమితం చేయడంతో పార్టీ బలహీనమవుతూ ఉండటం, రాజకీయ సవాళ్లు పెరుగుతూ ఉండడంతో తిరిగి ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకొంటూ మొత్తం ఆరుమందితో మంత్రివర్గాన్ని విస్తరించారు. 

అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. కేటీఆర్‌కు గతంలో చూసిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖను కేటాయించారు. అయితే జగదీశ్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖను తొలగించి విద్యుత్ శాఖకు ఇవ్వగా, విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. వేముల ప్రశాంత్ రెడ్డి వద్ద ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖలున్నాయి. అయితే రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కు కేటాయించారు. అత్యంత కీలకమైన జీఏడీ, ప్లానింగ్, రెవిన్యూ, మైనింగ్, నీటి పారుదల శాఖలను సీఎం కేసీఆర్ తన  వద్దే ఉంచుకున్నారు. 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.

కేబినెట్ లో ఇప్పటికే 12 మంది మంత్రులుండగా..తాజాగా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 18కు చేరింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.