గ్లోబల్ కరెన్సీ మార్కెట్‌లో కలకలం

గ్లోబల్ కరెన్సీ మార్కెట్‌లో శుక్కవారం కలకలం రేగింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధవాతావరణం మరింతగా వేడెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు తగ్గి రూ. 68.83కు పడిపోయింది. ఇది మూడు వారాల కనీస స్థాయి. ఇతర వర్థమాన దేశాల కరెన్సీల పతనంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది.

టర్కీలో రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ దేశ కరెన్సీ 14 శాతం మేర పతనం అయింది. ప్రజలు తమ వద్ద ఉన్న డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీలతో పాటు బంగారాన్ని కూడా దేశీయ కరెన్సీ లీరాలోకి మార్చాలంటూ టర్కీ అధ్యక్షుడు దేశ ప్రజలను కోరడంతో ఒక్కసారిగా కరెన్సీ మార్కెట్లు కుప్పకూలాయి.

దీనికి తోడు టర్కీ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందన్న వార్తలు వెలువడుతున్నాయి రూపాయి మారకం విలువ మూడు వారాల కనీస స్థాయికి పతనం కావడంతో రిజర్వ్‌బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంకుల సాయంతో రంగంలోకి దిగి మరింత పతనం కాకుండా నిరోధించగలిగింది.

మరో వైపు టర్కీ కరెన్సీని యూరోపియన్ బ్యాంకులు కలిగి ఉన్నాయన్న వార్తలతో యూరో 13 నెలల కనీస స్థాయిని పతనం అయింది. జపాన్ యెన్, బ్రిటన్ పౌండ్ మారకం విలువలు కూడా గణనీయంగా పతనం అయ్యాయి. ఇదిలా ఉండగా, రష్యన్ రూబుల్ రెండేండ్ల కనీస స్తాయికి పతనం అయింది.