వంద రోజుల జగన్ పాలనలో 110 తప్పులు 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  వంద రోజుల పాలనలో 110 తప్పులు చేశారని బిజెపి ఎంపీ సుజనాచౌదరి మండిపడ్డారు. చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాలు దొందూ దొందే అని, కీలకమైన పోస్టులు ఒకే సామాజిక వర్గానికే ఇస్తున్నారని విమర్శించారు.

అమరావతి భూములపై తన సవాల్‌ను స్వీకరించే ధైర్యం వైసీపీకి లేదని సుజనా ధ్వజమెత్తారు. అమరావతిలో అవినీతి అన్నారని, ఎందుకు నిరూపించలేకపోయారు? అని జగన్‌ను సుజనా ప్రశ్నించారు. అమరావతిని గోస్ట్‌ సిటీలా తయారు చేశారని, పోలవరం ప్రాజెక్ట్‌ అర్థాంతరంగా నిలిపివేశారని విమర్శించారు.

అమరావతి, పోలవరం పనులు నిలిపివేయడం, విద్యుత్ ఒప్పందాల రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వ విజయమా? అని సుజనా ప్రశ్నించారు. రాష్ట్రంలో వంద రోజులుగా అన్యమత ప్రచారం ఎక్కువైందని, వంద రోజుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ కార్యకర్తలకే వాలంటరీ పోస్టులు, బియ్యం సంచుల కాంట్రాక్ట్ కోసమే నాణ్యమైన బియ్యమంటున్నారని ఎద్దేవా చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయని, కడప స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఎక్కడ నుంచి తెస్తారు? అని సుజనా ప్రశ్నించారు. పథకాల పేర్లు మారిస్తే తప్పులేదని.. నిలిపివేత సరికాదని సుజనాచౌదరి హితవు చెప్పారు.

ప్రత్యేకహోదాపై రాజీలేని పోరాటమనడం హాస్యాస్పదమని మండిపడుతూ ఉన్న పోర్టులు రద్దు చేస్తే కొత్త పోర్టులు ఎలా వస్తాయని ఆయన నిలదీసేరు. రాజ్యాంగం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు సాధ్యం కాదని, స్థానికులకు ఉద్యోగాలు అంటే ఉన్న పరిశ్రమలు తరలిపోతాయని సుజనా హెచ్చరించారు. అన్న క్యాంటీన్ల పేరు మార్చి కొనసాగిస్తే సరిపోయెడిదిగదా అని అడిగారు.