గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ ఆత్మీయంగా వీడ్కోలు  

చాలా కాలం పాటు రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలందించిన గవర్నర్ నరసింహన్‌కు సీఎం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎయిర్‌పోర్టుకు వచ్చి వీడ్కోలు పలికారు. గవర్నర్ దంపతులు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ప్రత్యేక వాహనంలో తిరిగి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత మంత్రులందరి వద్దకూ వెళ్లి నమస్కరిస్తూ వారిచ్చిన పుష్పగుచ్ఛాలను తీసుకున్నారు.

ఆ సమయంలో నరసింహన్ వద్ద సుదీర్ఘకాలం పాటు పనిచేసిన సిబ్బంది కొంత ఉద్విగ్నానికి గురయ్యారు. చివరగా సీఎం కేసీఆర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి వీడ్కోలు పలికారు. నరసింహన్ ప్రత్యేక విమానం వెళ్లేవరకూ సీఎం కేసీఆర్ అక్కడే నిలబడ్డారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నరసింహన్ దంపతులు బెంగళూరు బయల్దేరారు.

అంతకు ముందు ప్రగతి భవన్ లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో  తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన నరసింహన్‌ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని కేసీఆర్‌ తెలిపారు. 

''రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులు ప్రతీ పండుగను గొప్పగా నిర్వహించేవారు. నరసింహన్‌ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా.. చివరికి తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమకారుడిగా, సీఎంగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను" అని గుర్తు చేసుకున్నారు. 

''నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే టీఆర్‌ఎస్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. గవర్నర్‌ నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల మంచి, చెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. పథకాల ఉద్దేశాలను తెలుసుకునేవారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని వాకబు చేసేవారు" అంటూ వివరించారు.