యాదాద్రి బొమ్మల తొలగింపుకు రాజాసింగ్ అల్టిమేటం

యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అల్టిమేటం ఇచ్చారు. వారంలోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.  

ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కదాన్ని స్థానిక బీజేపీ నేతలతో​ కలిసి శనివారం పరిశీలించారు.

సీఎం కేసీఆర్‌ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదని ధ్వజమెత్తారు. రాష్ట్ర బిజెపి నాయకత్వంతో చర్చించి త్వరలోనే యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. యాదాద్రిని ప్రజల సొమ్ముతో కట్టినవా? నీ సొంత సొమ్ముతో నిర్మిస్తున్నవా? భావితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కిన మీరు, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా?’ అని రాజాసింగ్ ప్రశ్నించారు.

మరోవైపు యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిందుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిందుత్వ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్‌ నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.