మంగ‌ళ గ్ర‌హంపై భార‌తీయ జెండాను నిలిపింది మీరే!

"చంద్ర‌యాన్ యాత్ర అద్భుతంగా సాగింది. మ‌న ఆర్బిటార్ ఇంకా చంద్రుడి చేరువ‌లోనే ఉంది. మంగ‌ళ గ్ర‌హంపై భార‌తీయ జెండాను నిలిపింది మీరే" అంటూ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధైర్యం చెప్పారు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన  చంద్రయాన్-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని  ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌ను ఉద్దేశించి  ప్రసంగిస్తూ ప్రశంసించారు. 

బెంగుళూరులోని సెంట‌ర్‌లో ఆయ‌న మాట్లాడుతూ "భార‌త మాత విజ‌యం కోసం కృషి చేశారు. భార‌త్ కోసం పోరాటం చేశారు. భ‌ర‌త‌మాత త‌ల ఎత్తుకునేలా చేశారు. ఉన్న‌త స్థాయిలో పెట్టేందుకు కృషి చేశారు. మీరు జీవితాన్ని అంకితం చేశారు. నిన్న రాత్రి మీ మ‌న‌స్సును అర్థం చేసుకున్నాను. మీ క‌న్నులు ఎన్నో విష‌యాలు చెబుతాయి. నిరాశ‌లో మీరున్నారు. అందుకే నేను మీ మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోయాను. మ‌ళ్లీ ఉద‌యం ఒక‌సారి మీతో మాట్లాడాల‌నుకున్నాను" అని చెప్పారు. 

"మీరెన్నో రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గ‌డిపారు. ఈ మిష‌న్‌తో సంబంధం ఉన్న వ్య‌క్తులు భిన్న‌మైన‌వారు. అనుకోకుండా ఒకేసారి ఏమీ తెలియ‌కుండాపోతో ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఏం అయ్యింది, ఎలా అయ్యింది .. ఇలాంటి ప్ర‌శ్న‌లు శాస్త్రవేత్తల‌ను వేధిస్తుంటాయి. మీరు అలాగే త‌ప‌న చెందారు. మ‌న‌కు ఇవాళ ఒక అవ‌రోధం ఎదురైంది.. కానీ ఏమాత్రం నీరుగారాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న ల‌క్ష్యం నుంచి దూరం కావాల్సిన అవ‌స‌రం లేదు. చంద్రుడిని చేరుకునే ల‌క్ష్యాన్ని వ‌దిలేది లేదు" అంటూ స్పష్టం చేశారు. 

చంద్రుడిని ముద్దాడాల‌న్న ఆశ మ‌రింత ప్ర‌బ‌ల‌మైంద‌ని ప్రధాని పేర్కొన్నారు. "భార‌త‌ ప్ర‌జ‌లారా.. గ‌త కొన్ని గంట‌ల నుంచి యావ‌త్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. మ‌న శాస్త్ర‌వేత్త‌లు ఎంతో కృషి చేశారు. మ‌నం మ‌న ల‌క్ష్యానికి ఎంతో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాం. కానీ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. స్పేస్ ప్రోగ్రామ్‌, శాటిలైట్ల ప‌నితీరుపై మ‌న గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. పౌరుల ఉత్త‌మ జీవితం కోసం మీరు ప‌నిచేస్తున్నారు. ఇత‌ర దేశాల కోసం కూడా మీ ప‌ని వినియోగ‌ప‌డుతుంది" అని చెప్పుకొచ్చారు. 

"మీ నైజానికి త‌గినట్లుగానే.. ఎవ‌రూ వెళ్ల‌ని ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. మీరు వీలైనంత ద‌గ్గ‌ర‌గా చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కుటుంబాల‌కు సెల్యూట్ చేస్తున్నాను. మ‌న దేశం ఎన్నో క‌ఠిన సంద‌ర్భాలను ఎదుర్కొన్న‌ది.. కానీ ఆ సంఘ‌ట‌న‌లు ఎప్పుడూ మ‌న స్పూర్తిని దెబ్బ‌తీయ‌లేదు. మీ ప్ర‌య‌త్నాలు విలువైన‌వ‌ని గ‌ర్వ‌ప‌డుతున్నాను. లెర్నింగ్ మ‌రింత ప‌టిష్ట‌ప‌రుస్తుంద‌ని ఆశిస్తున్నాను. కొత్త రోజు ఉద‌యిస్తుంద‌ని ఆశిస్తున్నాను" అంటూ ప్రోత్సహించారు. 

ఇంజినీర్లు, సైంటిస్టుల ప‌నితీరు ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని చెబుతూ "నేను మీవెంటే ఉన్నాను. దేశం కూడా మీవెంట ఉంది. ప్ర‌తి స‌మ‌స్య మ‌న‌కు ఒక కొత్త విష‌యాన్ని నేర్పుతుంది. కొత్త టెక్నాల‌జీ వైపు తీసుకువెళ్తుంది. విజ్ఞానంలో ప్ర‌యోగం, ప్ర‌యాసే ముఖ్యం. మ‌న సామ‌ర్థ్యం అప్పుడే తెలుస్తుంది" అంటూ భరోసా కల్పించారు. 

మ‌నం వంద‌కు మించి శాటిలైట్ల‌ను ఒకేసారి ప్ర‌యోగించి రికార్డు సృష్టించామ‌ని గుర్తు చేస్తూ `వ‌యం అమృత‌స్య పుత్ర‌హ‌' అని పేర్కొన్నారు. ల‌క్ష్యాన్ని చేరుకునేవ‌ర‌కు నేర్చుకోవాలి, సాధించాలి. రానున్న మిష‌న్ల‌లో విజ‌యం సాధించాలంటూ శుభాకాంక్ష‌లు చెప్పారు.