యాదాద్రి ఆలయ ప్రాకారాలపై కేసీఆర్ చిత్రాలతో  దుమారం   

తెలంగాణలో సుప్రసిద్ధ నరసింహ క్షేత్రమైన యాదాద్రి ఆలయ ప్రాకారాలపై సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ చిత్రాలను చెక్కటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కెసీఆర్ చిత్రాలే కాదు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గుర్తు కారు…కెసీఆర్ కిట్ పథకాలను కూడా ఇందులో చిత్రీకరించటం పెద్ద రాజకీయ వివాదంపై దారితీస్తున్నది. దీని పట్ల హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాలను పార్టీ ప్రచారం కోసం వాడుకోవడం ఏమిటని అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

ఓ గుడి ప్రాంగణంలో ముఖ్యమంత్రి చిత్రాలు, .రాజకీయ పార్టీ గుర్తులు,  పథకాలు చిత్రీకరించటం బహుశా చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదని విమర్శలు చెలరేగుతున్నాయి.  యాదాద్రి దేవాలయంలో కెసీఆర్ ఫోటోలు చిత్రీకరించిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంత వరకూ ఎక్కడా అధికారిక స్పందన వచ్చినట్లు కన్పించటం లేదు.  అంటే ఇది అంతా కెసీఆర్ కు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే శిల్పులు అభిమానంతోనే కెసీఆర్  చిత్రం  చెక్కారు తప్ప..దీని వెనక ఎవరి ఆదేశాలు లేవంటూ యాదాద్రి దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కెసీఆర్ బొమ్మ తీసేయటానికి కూడా తాము సిద్ధం అంటూ నష్ట నివారణ చర్యకు ఉపక్రమించినట్లు కనబడుతున్నది.  పైగా, సీఎంగారిని దేవుడిగా  శిల్పులు చూస్తున్నారని అంటూ ఆర్కిటెక్ట్ ఆనందసాయి వింత భాష్యం చెప్పారు. 

హద్దులు దాటుతున్న ఇటువంటి వ్యక్తి ఆరాధన చట్టప్రకారం నేరం కూడా అవుతుందని మరచిపోతున్నారు. దేవాలయాలలో ఇటువంటి అప్రదిష్ట చర్యలు అత్యున్నత స్థాయిలో ఆదేశాలు లేకుండా శిల్పులు దిగుతారని చెప్పడం ప్రజలను మభ్య  పెట్టడమే కాగలదు. 1988లో వచ్చిన మతపరమైన కట్టడాలు, సంస్థల దుర్వినియోగం చట్టం ప్రకారం మతపరమైన సంస్థల ప్రాంగణాలలో రాజకీయ ప్రేరేపిత ప్రచారం, ప్రకటనలకు పాల్పడటం నేరం కాగలదు. 

ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవాయలాలు కట్టించినవారెవరూ కూడా ఎక్కడా తమ చిత్రాలు కాదు కదా? పేర్లు కూడా పెట్టుకున్న దాఖలాలు లేవు. యాదాద్రి పరిణామాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి కూడా మండిపడుతోంది. కెసీఆర్ తక్షణమే సమాధానం చెప్పాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. యాదాద్రిలో ఏమైనా జరగరానిది జరిగితే దానికి సీఎం కెసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని  హెచ్చరించారు.