8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు  

ఉజ్వల పథకం కింద దేశంలోని నిరుపేద కుటుంబాలకు 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు అందించాలన్న లక్షాన్ని ప్రభుత్వం పథకం గడువుకన్నా దాదాపు ఏడు నెలలు ముందుగానే చేరుకోనుంది. ఈ పథకం కింద 8వ కోటి కనెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం లబ్ధిదారుకు అందించనున్నారు. 

2019 మార్చినాటికి నిరుపేద మహిళలకు ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు అందించాలనే లక్షంతో 2016 మే 1న ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రాంభించారు. తర్వాత ఈ లక్షాన్ని 2020 మార్చి నాటికి 8 కోట్ల కనెక్షన్లుగా సవరించారు. ‘సెప్టెంబర్ 7న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పెంద్రాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 8వ కోటి కనెక్షన్‌ను అందజేస్తారు’ అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. 

వంట చేయడానికి వంటచెరకును ఉపయోగించడం వల్ల కలిగే వాయుకాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా 2014 మే నాటికి 55 శాతంగా ఉన్న వంటగ్యాస్ వినియోగాన్ని 95 శాతానికి పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు చమురు కంపెనీలు అందించే ప్రతి కనెక్షన్‌కు ప్రభుత్వం రూ.1600 సబ్సిడీ చెల్లిస్తుంది. సిలిండర్ సెక్యూరిటీ ఫీజు, ఫిట్టింగ్ చార్జీల కింద ఈ సబ్సిడీ చెల్లిస్తారు. అయితే గ్యాస్ స్టవ్‌ను మాత్రం లబిదారులు కొనుక్కోవాలి. ఈ భారాన్ని కూడా తగ్గించడానికి దాని ఖరీదుతో పాటు తొలి సిలిండర్ ఖరీదును వాయిదాలపై చెల్లించేందుకు కూడా ఈ పథకంలో వీలు కల్పించారు. 

అంతేకాదు లబ్ధిదారులంతా నిరుపేదలైనందున అయిదు కిలోలు లేదా, 14.2 కిలోల సిటిండర్లలో దేనినైనా తీసుకునే వీలును కూడా కల్పించారు. చమురు కంపెనీలు ఉద్యమ స్ఫూర్తితో ఈ పథకాన్ని అమలు చేయడంతో ఏడు నెలలు ముందుగానే లక్షాన్ని చేరుకోగలిగినట్లు ఆ ప్రకటన తెలిపింది.  

ఈ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందిన రాష్ట్రాల్లో యుపి (1.46 కోట్లు), పశ్చిమ బెంగాల్ (88 లక్షలు), బీహార్ (85 లక్షలు), మధ్యప్రదేశ్ (71 లక్షలు), రాజస్థాన్ (63) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లబ్ధిదారుల్లో దాదాపు 40శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన వారు కావడం విశేషం.