'చంద్రయాన్-2' ప్రత్యేక క్షణాలను వీక్షించండి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'చంద్రయాన్-2' ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ల్యాండర్ 'విక్రమ్' జాబిల్లిపై మరి కొద్ది గంటల్లోనే కాలుమోపనుంది. ఈ ఉద్విగ్వ క్షణాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రయాన్ ప్రత్యేక క్షణాలను వీక్షించి, అందుకు సంబంధించిన ఫోటోలు, అనుభూతులను తనతో షేర్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో దేశ ప్రజలను కోరారు. 

శనివారం తెల్లవారుజామున 1.55 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత...సుమారు 5.30 నుంచి 6.30 మధ్య అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ వెలుపలికి వస్తుంది. అయితే విక్రమ్ చంద్రుడిపై నెమ్మదిగా దిగడానికి పావుగంట పడుతుంది. ఇది అత్యంత క్లిష్టమైన ల్యాండిగ్ కావడంతో దీనిని '15 మినిట్స్ ఆఫ్ టెర్రర్'గా వ్యవహరిస్తారు. 

శాస్త్రజ్ఞుల కృషి ఫలించి, అంతా సజావుగా జరిగేతే విక్రమ్ మృదువుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇంతవరకూ అలా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనతను దగ్గించుకున్న అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్  చేరుతుంది. 'భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాల చరిత్రలోనే అసాధారణ ప్రయోగమిది. 

చివరి ఘట్టాన్ని బెంగళూరు ఇస్రో సెంటర్‌లో ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. ఈ ప్రత్యేక క్షణాలను వీక్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా హాజరవుతున్నాయి. వారిలో భూటాన్‌కు చెందిన యువకులు కూడా ఉన్నారు' అని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

2019 జూలై 22న 'చంద్రయాన్-2' ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి అప్‌డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ఉన్నానని, భారతీయుల ప్రతిభ, స్ఫూర్తికి ఈ మిషన్ ఓ ఉదాహరణగా నిలుస్తుందని, ఈ మిషన్ విజయవంతం కావడం వల్ల కోట్లాది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని మరో ట్వీట్‌లో మోదీ తెలిపారు. 

మన శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే ఈ ప్రయోగం చివరి ఘట్టాన్ని అంతా వీక్షించి అందుకు సంబంధించిన ఫోటోలను తనతో షేర్ చేసుకోవాలని, వాటిలో కొన్నింటికి తాను రీట్వీట్ చేస్తానని మోదీ ట్విటర్ ద్వారా కోరారు.