కేంద్రం దృష్టికి 'ఆంధ్రాబ్యాంకు విలీన' విషయం

ఆంధ్రాబ్యాంకు విలీనంపై ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

కాగా, 2024 ఎన్నికలలో తాము రాష్ట్రలో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారవేసారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పొత్తుల వల్ల బీజేపీ నష్టపోయిందని చెబుతూ, ఇకపై ఎవరితో పొత్తులు పెట్టకోకుండా పార్టీని బలోపేతం చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగాలన్నదే తమ అభిమతమని తెలిపారు. 

కాగా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పిన జగన్మోహనరెడ్డి అందుకు విరుద్ధంగా పోలీసు రాజ్యం తీసుకువచ్చారని కన్నా మండిపడ్డారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శత్రువులను సైతం ఆదరించే వారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు దిగే సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు. 

టిడిపి హయాంలో ఆ పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామాల్లో అరాచకం సష్టించారని, వారు చేశారు కాబట్టి మేం చేస్తామనే ధోరణిలో వైసిపి వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని చెబితే సరిపోదని, వైసిపి ప్రభుత్వానికి చేతనైతే అసలు దొంగలను పట్టుకోవాలని సూచించారు.   

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాలపై దాడులు, వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధానాలనే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా అనుకరిస్తుందేమోననే అనుమానం వ్యక్తంచేశారు. ఇదే పంథా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోరపరాభవం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయే తప్ప మైనింగ్ దోపిడీ మాత్రం ఆగలేదని ధ్వజమెత్తారు.