తూర్పు దేశాల్లో భారత్ బిలియన్ డాలర్ల పెట్టుబడులు

తూర్పు దేశాల అభివృద్ధిలో భాగంగా భారత్ బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్‌లో జరిగిన 5వ తూర్పు దేశాల ఆర్ధిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

‘‘తూర్పు దేశాల అభివృద్ధి కోసం భారత్ బిలియన్ డాలర్లు ఇవ్వనుంది. ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా మా ప్రభుత్వం తూర్పు ఆసియా సంబంధాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మన ఆర్ధిక దౌత్యానికి ఈ విధానం కొత్త దారి చూపిస్తుంది...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తూర్పు దేశాల ఆర్ధిక సదస్సుకు తనను ఆహ్వానించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సదస్సు సందర్భంగా జరిగిన మేథోమథనం కేవలం తూర్పు ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాళి మానవ సంక్షేమానికి ఊతమిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 తూర్పు దేశాలతో భారత్‌కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదనీ, చాలా పురాతనమైనది మోదీ తెలిపారు. వ్లాదివోస్టోక్‌‌లో తొలి దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది భారతదేశమేనని గుర్తుచేశారు. 

‘‘ఇతర దేశీయులపై ఆంక్షలున్నప్పటికీ కూడా భారతీయుల కోసం వ్లాదివోస్టోక్ తలుపులు తెరిచే ఉంచింది’’ అని పేర్కొన్నారు. 2024 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అన్న ‘మంత్రం’తో నవభారతాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని మోదీ చెప్పారు. తూర్పు ఆసియా ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భారత్‌ కూడా భాగస్వామ్యమైందని చెపారు