భారత్ లో 20 రష్యా న్యూక్లియర్ పవర్ యూనిట్లు

రాబోయే ఇరవై ఏళ్లలో ఇండియాలో 20కి పైగా అణు విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. రెండ్రోజుల పర్యటన కోసం రష్యా ఈస్ట్రన్ సిటీ వ్లాడివోస్టాక్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి 20వ వార్షిక సదస్సులో పాల్గొని సంయుక్త ప్రకటన చేశారు. మిలటరీ, సాంకేతిక సహకారం, ఇంధనం, సైన్స్, ఎల్ఎన్‌జీ బిజినెస్, ఎల్ఎన్‌జీ సరఫారాలు, సహజవాయువులు సహా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.  

చెన్నై నుంచి వ్లాడివోస్టాక్ వరకూ పూర్తి స్థాయి సముద్ర మార్గం ఏర్పాటుకు ఒక ప్రతిపాదన వెలువడినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనికి ముందు ఈ రెండింట మధ్య సముద్ర మార్గ కమ్యూనికేషన్స్ ఏర్పాటుకు సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆయన వివరించారు. అణు కర్మాగారాల ఏర్పాటు విషయంలో నికరమైన భాగస్వామ్య పక్షానికి సంకల్పించినట్లు కూడా మోడీ తెలిపారు.  భారతదేశం తలపెట్టిన గగన్‌యాన్‌కు రష్యా సహకారం ఉంటుంది. ఇందులో భాగంగా భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ కల్పిస్తారు.

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ చేయడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనైనా బయట శక్తుల ప్రమేయానికి తమ రెండు దేశాలు (ఇండియా, రష్యా) వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాగా, పలు అంతర్జాతీయ అంశాల విషయంలోనూ ఉభయ దేశాలు ఒకేరకమైన దృక్పథంతో ఉన్నాయని పుతిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సు, బిస్కెక్‌లో జరిగిన షాంఘై సహకార మండలి (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగానూ మోదీని తాను కలుసుకున్నట్టు చెప్పారు.

'వివిధ రంగాల్లో పలు ఎంఓయూలపై ఇవాళ ఇరు దేశాల మధ్య సంతాకాలు జరిగాయి. సివిల్ న్యూక్లియర్, ఎల్‌ఎన్‌జీ వంటివి కూడా ఇందులో ఉన్నారు. కుడాంకులం అణు విద్యుత్ ప్లాంట్ మొదటి, రెండవ యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడు, నాలుగో యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి రష్యా డిజైన్ చేసిన 20కి పైగా అణు యూనిట్లు ఇండియాలో వచ్చే ఇరవై ఏళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం' అని పుతిన్ తెలిపారు.

రష్యాకు ఇండియా ఎప్పుడూ కీలక భాగస్వామ్య మిత్రపక్షంగా ఉంటుందని అధ్యక్షులు పుతిన్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక ప్రత్యేకతలను సంతరించుకుని ఉన్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తృతపర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ద్వైపాక్షిక వ్యాపారం 17 శాతం పెరిగి ఇప్పుడు 11 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది మరింతగా ఇనుమడిస్తుందని పుతిన్ తెలిపారు.

ఇండియా, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటు కూడా జరుగుతుందని చెప్పారు. అణు ఇంధన రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కీలకం అని ఇందులో భాగంగా కుదంకుళం అణు ఇంధన కర్మాగారానికి రష్యా సహకారం ఉంటుందని తెలిపారు. 

\