భారత్-రష్యాలది దృఢమైన బంధం

భారత్-రష్యాలది దృఢమైన బంధమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ఇరు దేశాల మధ్య  స్నేహబంధం   తన పర్యటనతో మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ.  

వ్లాదివొస్టోక్‌లో ఇవాళ ఆయ‌న ఆదేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలు ప‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. త‌న‌కు ఆహ్వానం పంపినందుకు పుతిన్‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు మోదీ చెప్పారు. 2001లో జ‌రిగిన వార్షిక స‌మావేశాన్ని ప్ర‌ధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అప్ప‌టి ప్ర‌ధాని అట‌ల్‌జీ బృందంలో గుజ‌రాత్ సీఎంగా తాను ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. 

ర‌ష్యా, భార‌త్ మ‌ధ్య స్నేహ‌బంధం రోజు రోజుకూ బ‌ల‌ప‌డుతోంద‌ని మోదీ అన్నారు. చెన్నై నుంచి వ్లాదివొస్టోక్ మ‌ధ్య పూర్తి స్థాయి స‌ముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని ఇరు దేశాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. 

‘‘రష్యా మాకు పరిపూర్ణమైన స్నేహితుడు. భారత్‌కు నమ్మకమైన భాగస్వామి కూడా. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వ్యక్తిగతంగా దృష్టిపెట్టాం. మంచి స్నేహితులుగా తరచూ మన దేశాల మధ్య సమావేశాలు జరిగాయి. అనేక అంశాలపై నేను మీతో ఫోన్ ద్వారా మాట్లాడాను. అయినప్పటికీ ఎప్పుడు ఎలాంటి సంశయానికి గరికాలేదు..’’ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

అంత‌క‌ముందు జ్వెజ్‌దా షిప్‌యార్డును మోదీ సంద‌ర్శించారు. షిప్‌యార్డుతో ఆర్కిటిక్ షిప్పింగ్ అభివృద్ధి చెందుతుంద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. నౌకాశ్ర‌యంలో ఉన్న అద్భుత టెక్నాల‌జీని పుతిన్ త‌న‌కు చూపించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  

రష్యా అత్యున్నత పౌర పురస్కారం తనకు ప్రకటించడంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పుతిన్ కు ధన్యవాదాలు చెప్పిన ఆయన ఈ గౌరవం 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఎత్తులకు తీసుకెళ్లాలని కోరారు.