బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌


టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ బుధవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.  

తాను బీజేపీలో చేరే విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెప్పానని రేవూరి స్పష్టం చేశారు.  రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలో చేరానని చెబుతూ తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్‌ఎస్‌​ అధికారంలోకి వచ్చిందని, కానీ తెలంగాణ ఫలాలు మాత్రం ప్రజలకు అందడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ విభజించు పాలించు అనే సూత్రంతో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరుల్ని కొల్లగొట్టారని ఆరోపించారు.  

టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తామని  ఈ సందర్భంగా మురళీధర్‌ రావు తెలిపారు. బీజేపీనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి అని, అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. 

బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పోలీసులను ఉసిగొల్పుతోందని డా. లక్ష్మణ్ ఆరోపించారు.   నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలపై కక్షతో వారి జిల్లాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్‌, గ్రానైట్‌లలో అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు.