అమిత్‌షా పర్యటనతో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రానున్న దృష్ట్యా ఆపార్టీ ప్రచారాన్ని ప్రారంభించేందుకు పార్టీ అద్యక్షుడు అమిత్ షా ఒకరోజు పాటు శనివారం రాష్ట్రంలో జరుపుతున్న పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా ఉంటుందని బిజెపి రాష్ట్ర శాఖా అద్యక్షుడు డా. కే లక్ష్మణ్  పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాల ప్రాంగణంలో బిజెపి ఎన్నికల శంఖారావాన్ని అమిత్‌ షా పూరిస్తారని తెలిపారు.

బిజెపి అద్యక్షుడు ఉద్యమ 11.30గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి 12 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం 2గంటలకు పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని బహిరంగసభకు బయలుదేరుతారని వివరించారు.

తిరిగి వస్తూ సాయంత్రం 6గంటలకు కొత్తూరులో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారని లక్ష్మణ్‌ తెలిపారు.

కాగ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. జీవంలేని కాంగ్రెస్‌ను టిడిప, సీపీఐ వంటి పార్టీలు బతికించలేవని స్పష్టం చేశారు.