ప్రభత్వంలో విలీనం కానున్న ఏపీఎస్సార్టీసీ

ఏపీఎస్సార్టీసీ (ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) త్వరలో ప్రభుత్వంలో విలీనం కానుంది. బుధవారం జరగనున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీనిచ్చిన విషయం విదితమే. 

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదికను మంగళవారం నాడు సీఎం జగన్ కు ఆంజనేయ రెడ్డి కమిటీ ఇచ్చింది.

ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించినట్లు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు. కాగా ఇందుకు సీఎం వైఎస్ జగన్ కూడా ఆమెదం తెలిపారని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.   

మొత్తంమీద... పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టుగా  నాలుగవ తేదీన జరిగే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. 

ఆంజనేయ రెడ్డి కమిటీ పలు అంశాలను తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదికకు బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ప్రస్తుతం ప్రతీ నెలా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు వేతనాల కోసం రూ. 3300 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే ఈ నిధులను ప్రభుత్వం చెల్లించనుంది.  

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెట్టేలా ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.