ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక అంశం

ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక అంశంగాకేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి అభివర్ణించారు.  శ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబట్టే ఆర్టికల్ 370, 35 ఎలను ఇటీవల పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన నేపధ్యంలో బీజేపీ నెల్లూరు జిల్లా శాఖ నెల్లూరులో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ   ఎవరూ చేయలేని సహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపెట్టారని కొనియాడారు. 

దీని ద్వారా బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించిందని, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు ఈ చట్టాన్ని భారత ప్రజలపై రుద్దారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఒకే దేశం.. ఒకే జెండా ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ విధానమని, దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం సంచలనమైందని తెలిపారు. 

ఆర్టికల్ 370ను రద్దుచేస్తే పక్కనున్న పాకిస్తాన్‌కు ఎందుకు నొప్పని ప్రశ్నించారు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్‌తో ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు యుద్ధం చేశామని, అవసరమైతే మరోసారి చేయడానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసి అన్ని దేశాల మద్దతు కూడగట్టారని కొనియాడారు. భారతదేశ సమగ్రతకు బీజేపీ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని పేర్కొన్నారు.