మహిళా మంత్రి లేని తెలంగాణకు మహిళా గవర్నర్!


గత ఐదున్నరేళ్లుగా తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఒక వంక నెట్టుకొసుండగా, తెలంగాణకు ఒక మహిళా నాయకురాలిని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించడంతో అధికార పక్షం ఇరకాటంలో పడినట్లయింది. 

తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌రాజన్‌ నియమితులయ్యారు. దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం గవర్నర్ పదవిలో కొనసాగిన తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్థానంలో ఆమెను నియమించారు. సౌందర్‌ రాజన్‌ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 

డా.తమిళసై సౌందర్‌రాజన్‌ (58) తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు. వైద్య వృత్తి నుంచి వచ్చిన తమిళిసై అనతికాలంలోనే బీజేపీ మహిళా అగ్రనేతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్‌2న కుమారి అనంతన్‌, కృష్ణ కుమారి దంపతులకు తమిళిసై జన్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2నే ఆమె జన్మదినం కావడం విశేషం. 

మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. చెన్నైలోని డాక్టర్ ఎం జీఆర్ వైద్య వర్సిటీలో గైనకాలజీలో పీజీచేశారు. అనంతరం కెనడాకు వెళ్లి సోనోలజీ, ఎఫ్‌ఈటీ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. తర్వాత చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేండ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పలు దవాఖానలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉండేవారు. ఆమె భర్త సౌందర్‌రాజన్ కూడా ప్రముఖ డాక్టర్. ప్రస్తుతం ఆయన భారత వైద్య పరిశోధనామండలిలో పాలకమండలి సభ్యుడు. వారి కుమారుడు సుగునాథ్, కోడలు దివ్య కూడా డాక్టర్లే. కుటుంబమంతా ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు.   

తమిళిసై సౌందరరాజన్ తండ్రి అనంతన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు. దీంతో చిన్నప్పటినుంచే ఆమెపై రాజకీయాల ప్రభావం పడింది. మ ద్రాస్ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే విద్యార్థిసంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. పుట్టింది కాంగ్రెస్ కుటుంబంలోనే అయి నా.. ఆమె బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 

1999లో దక్షిణ చెన్త్నె జిల్లా వైద్యవిభాగం కార్యదర్శిగా పనిచేశారు. 2001లో వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో జాతీ య సహ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యా రు. 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. 2014లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. 

తమిళనాడులో ఇటీవల జరిగిన జల ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. తాజాగా ఆమె నేతృత్వంలో తమిళనాడులో 44.5 లక్షల బీజేపీ సభ్యత్వాలు నమోదయ్యాయి. తమిళిసై పార్టీలో, తమిళనాడు రాజకీ యాల్లో తనదైన ముద్ర వేసినా.. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. ఆమె 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీచేసి డీఎంకే నాయకురాలు కణిమొళి చేతిలో ఓటమిపాలయ్యారు. 

తమిళిసైకి మీడియారంగంలోనూ అనుభవం ఉన్నది. పిల్లల్లో వక్తృత్వ నైపుణ్యాలు పెంచేందుకు దాదాపు పదేండ్లపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాజ్‌టీవీలో ఇది ప్రసారమైంది. దూరదర్శన్‌లో మగలిర్ పంచాయత్ (మహిళల న్యాయస్థానం) పేరుతో ఐదేండ్లపాటు మరో కార్యక్రమాన్ని నడిపించారు. రాజకీయనేతగా పలు స్థానిక, జాతీయ టీవీ చానళ్లలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. 

మహిళా సమస్యలపై స్పందించడంలో తమిళిసై ముందుంటారు. ఇటీవల ఉవ్వెత్తున ఎగిసిన మీ టూ ఉద్యమానికి ఆమె బాసటగా నిలిచారు. ముఖ్యం గా గాయని చిన్మయి శ్రీపాదకు అండగా ఉన్నారు. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నేతలు, ఇతర ప్రముఖులు మౌనం వహించడాన్ని ఆమె బహిరంగంగా తప్పుబట్టారు. తమిళిసై ఆస్తికురాలు. దేవాలయ కమిటీల్లో భక్తులే ఉండాలని, ఆస్తికుల చేతుల్లోనే ఆలయ నిర్వహణ ఉండాలన్నది ఆమె అభిప్రాయం.  

దేశ సేవకు మరింత అంకితమవుతానని తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళి సై సౌందర రాజన్ పేర్కొన్నారు. తనను తెలంగాణ గవర్నర్ గా నియమించిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవ చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆమె తెలిపారు. తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఆ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.