బెంగాల్ లో బీజేపీ ఎంపీ వాహనంపై దాడి

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్‌ నేతపై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు.  

పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న బరాక్‌పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారును టీఎంసీ కార్యకర్తలు కొందరు ధ్వంసం చేశారు. 

బీజేపీ కార్యాలయంపై మమతా బెనర్జీ ఫోటోతో కూడిన బ్యానర్లు కట్టడంతో అర్జున్ సింగ్ ఆధ్వర్యంలో కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.  బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌కు తలపై గాయాలయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. 

కాగా బరక్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ వర్మ తన తలపై లాఠీతో బలంగా కొట్టారని, బీజేపీ కార్యకర్తలనూ ఆయన చితకబాదారని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. మమతా బెనర్జీ ఆదేశాల మేరకే ఈ ఘటన చోటుచేసుకుందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని కూడా తనకు తెలుసుననీ అర్జున్ సింగ్ ఆరోపించారు.

బీజేపీ ఎంపీ కారును తృణమూల్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.