మిజోరాం హోం మంత్రి రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఈశాన్య రాష్త్రాలలో భారీ ఎదురు దెబ్బ తగులుతుంది. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డి డి లేలంగ్ పార్టీకి రాజీనామా చేసిన మరుసటి రోజుననే  మిజోరాం హోం మంత్రి ఆర్ లల్జిర్లియానా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లాకు సమర్పించారు.

 సైటుయల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయి జిల్లాగా గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని  ఈ సందర్భంగా ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

లల్జిర్లియానా రాజీనామాతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం మిజోరాం అధికార పార్టీ కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. మిజోరాం శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది.

లల్జిర్లియానా మిజారాం పీసీసీ ఉపాధ్యక్షుడు కూడా. కాంగ్రెస్ ఇటీవల ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపించింది. ఆయనకు ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లాతో సత్సంబంధాలు కరువయ్యాయి.