అజ్ఙానంతోనే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారు

కొద్దిమంది మాత్రం అజ్ఙానంతో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ధ్వజమెత్తారు. జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణం చట్టం, ఆర్టికల్ 370 రద్దు- వర్థమాన పరిస్థితులు అంశంపై కరీంనగర్ లో జరిగిన సదస్సులో మాట్లాడుతూ 72 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించామని చెప్పారు. 

హైదరాబాద్ విలీన బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా నెహ్రూ తీసుకుని ఉంటే ఇక్కడ కూడా 370వ అధికరణం వచ్చేదని ఎద్దేవా చేశారు.  తెలంగాణ ప్రజలు ఈ విషయంలో అదృష్టవంతులని చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు చేయాలని బాల్యం నుంచి పోరాడి వృద్ధులైన వారున్నారని చెబుతూ వాళ్ళందరినీ త్వరలో సన్మానిస్తామని తెలిపారు. 

దేశంలో ఎక్కడివారైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ జమ్మూ కశ్మీర్ లో చేసుకునే వీలుండేది కాదని, జాతీయ జెండాతో సమానంగా కశ్మీర్ జెండా ఎగరాలని రూలుండేదని రామ్ మాధవ్ గుర్తు చేశారు. రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాల పద్ధతితో అక్కడి ప్రజలు అవస్థలు పడ్డారని, కొందరే లాభ పడ్డారని పేర్కొన్నారు. 

పాకిస్థాన్ నుంచి ఇండియాకి శరణార్థులుగా వచ్చిన వారు దేశ ప్రధానులయ్యారని, కానీ 70 ఏళ్లుగా కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని విమరసంచారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాడటం వల్ల కొంత కాలం క్రితమే రిజర్వేషన్ వచ్చిందని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన వారికి ఎలాంటి ప్రాథమిక హక్కులుండేవి కావని తెలిపారు. 

మహిళలందరికీ తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదని, కేవలం అక్కడి వారినే చేసుకోవాలని, లేదంటే పౌరసత్వం రద్దయ్యేదని పేర్కొన్నారు.  కానీ, మగవాళ్లకు మాత్రం ఈ నిబంధన చెల్లదని విస్మయం వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఆర్టికల్ తీసేస్తే రాద్ధాంతం ఎందుకు? అక్కడి ప్రజలను అడగకుండా తీసేసారంటున్నవాళ్లు.. అసలు ఎవరినడిగి తెచ్చారు? అని ప్రశ్నించారు.  ఈ ఆర్టికల్ ప్రవేశ పెట్టేటప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇద్దరు తప్ప అందరూ వ్యతిరేకించారని రామ్ మాధవ్ తెలిపారు. అందరూ వ్యతిరేకించినా నెహ్రూ వల్లే ఈ ఆర్టికల్ వచ్చిందని మండిపడ్డారు. 

కశ్మీర్ లోని కొందరి రాజకీయ అవసరాలకు మాత్రమే ఇది ఉపయోగపడిందని దుయ్యబట్టారు. అక్కడి ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అక్కడి ప్రజలు తాము ఇంతకాలం మోసపోయామని అర్థం చేసుకుంటున్నారని రామ్ మాధవ్ చెప్పారు.

“ఐదేళ్లలో రూ.90 వేల కోట్ల ఆర్థిక సహాయం ఆ రాష్ట్రానికి అందించాం. జమ్ముకశ్మీర్ ప్రజల డిగ్నిటీ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. జమ్మూ కశ్మీర్ ను పాకిస్థాన్ కోణంలో చూడొద్దు. అది మనది. పాకిస్థాన్ ను ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసు. అక్కడి ప్రజల రాజకీయ అధికారాలు, అభివృద్ధి, ప్రజలకు డిగ్నిటీ కోసం ప్రయత్నిస్తున్నాం" అని వివరించారు. 

జమ్ము కశ్మీర్ భూభాగం మాత్రమే కాదు అక్కడి ప్రజలు కూడా మనవాళ్లే అని, వాళ్లను మనం ఆలింగనం చేసుకోవాలని రామ్ మాధవ్ పిలుపిచ్చారు. సెలవుల్లో మనందరం అక్కడికి విహార యాత్రలకు వెళ్ళాలి. అక్కడ సామాన్య పరిస్థితులు మెరుగు పడడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.