పోలవరంపై బిజెపి సమరభేరి....కేంద్రమే చేపట్టాలి!

ప్రాజెక్టు పూర్తి చే యాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని, గత ప్రభుత్వంలో తప్పులను ఎత్తి చూపేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని నిర్ధారణకు వచ్చిన ఏపీ బిజెపి ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దపడుతున్నది. పోలవరం విషయంలో కేంద్రానికి కీలక సిఫారసు చేయాలని దాదాపు నిర్ణయించింది. ఇందుకోసం వినాయక చవితి తర్వాత పోలవరాన్ని ఆ పార్టీ నేతలు సందర్శించనున్నారు. 

హైదరాబాద్‌లో జరిగిన చింతన్‌ బైఠక్‌ (ఆలోచనా సమావేశం)లో నిధులిస్తున్న మోదీ ప్రభుత్వమే ప్రాజెక్టు చేపడితే గందరగోళానికి ముగిం పలకడంతోపాటు పార్టీకి మైలేజ్‌ తెచ్చుకోవచ్చన్న ఆలోచనకు వచ్చారు. వైసీపీ ప్ర భుత్వంపై మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వీరు అభిప్రాయపడ్డారు.

‘కేంద్రమే పోలవరానికి మొత్తం నిధులు సమకూర్చుతున్నప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు ఎందుకు అప్పగించాలి’ అని మరికొందరు నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. కేంద్రమే రంగంలోకి దిగితే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని.. ఫలితంగా బీజేపీకి మైలేజ్‌ వస్తుందన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమైంది. 

అయితే కేంద్రానికి రాష్ట్ర పార్టీ తరపున సిఫారసు చేసే ముందు పోలవరం సందర్శనకు వినాయక చవితి తర్వాత టెక్నికల్‌ టీమ్‌తో కలిసి పార్టీ కీలక నేతలు పోలవరం వెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సతీశ్‌జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకులు సునీల్‌ దేవధర్‌, పురందేశ్వరి, సుజనాచౌదరి, పైడికొండల మాణిక్యాలరావు, హరిబాబు తదితర నేతలు పాల్గొన్నారు.