ఎన్నార్సీ తుది జాబితాపై బిజెపి కీలకనేత అసంతృప్తి

అస్సాం పౌరులను గుర్తిస్తూ ప్రకటించిన జాతీయ పురసత్వ రిజిస్టర్ పట్ల ఆ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత, మంత్రి హిమంత బిశ్వాస్ శర్మ  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నార్సీ విషయంలో తాను ఆశలు వదులుకున్నానని తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశారు. హిందువులను ఈ జాబితా నుంచి పెద్ద సంఖ్యలో వదిలిపెట్టడంతోనే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. 

‘ఎన్నార్సీ విషయంలో ఆశలన్నీ వదులుకున్నాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజు ప్రశాంతంగా గడిస్తే చాలు’ అని తెలిపారు. విదేశీయులను తొలగించడానికి ఢిల్లీ, అస్సాం ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని, ఇదే తుది జాబితాగా తాను భావించడం లేది, మరిన్ని జాబితాలు వచ్చే అవకాశమున్నట్లు తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

చాలా మంది ఆరోపిస్తున్నట్లుగా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం జాబితాలో అనుమానాస్పద వ్యక్తులను కూడా చేర్చారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. 1971 కి ముందు బంగ్లా నుంచి శరణార్థులుగా వచ్చిన చాలా మంది భారతీయ పౌరుల పేర్లను ఎన్‌ఆర్సీలో చేర్చలేదు. ఎందుకంటే శరణార్థుల ధ్రువీకరణ పత్రాలను అంగీకరించడానికి అధికారులు నిరాకరించారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. 

ఇంతకు ముందే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కోరినట్లు సరిహద్దు ప్రాంతాల్లో కనీసం 20 శాతం, 10 శాతం మిగిలిన అస్సాం ప్రాంతాల్లో జాబితాను రీ వేరిఫికేషన్ కోసం సుప్రీం అనుమతించాలని హేమంత్ బిశ్వాస్ శర్మ కోరారు.