ప్రగ్యాసింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హెచ్చరిక

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి తలనొప్పిగా మారిన భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌కు మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌సింగ్ హెచ్చరిక జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నాయకత్వానికి సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని రాకేష్ సింగ్ హెచ్చరించారు. 

బీజేపీ నేతల వరుస మరణాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ, తమ పార్టీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. 

‘‘నేను ఎన్నికల ప్రచారంలో ఉండగా... బీజేపీ నేతలపై ప్రతిపక్షం చేతబడి చేస్తుందని ఓ సాధువు చెప్పాడు. చెడుకాలం రాబోతున్నదనీ.. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు..అయితే తర్వాత నేను ఆయన చెప్పిన సంగతులు మర్చిపోయాను. కానీ పార్టీ నేతలు ఒకరి వెంట ఒకరు మనల్ని విడిచి వెళ్లిపోతుండడం చూసి, నాటి సాధువు మాటలు గుర్తొచ్చాయి. మీరు నమ్మండి నమ్మకపొండి.. ఇది నిజం, ఇదే జరుగుతోంది...’’ అని ప్రగ్యా చెప్పుకొచ్చారు. 

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ నెల 24న తన 66 ఏట తుదిశ్వాస విడిచారు. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం గౌర్ కూడా ఇదే నెల 21న మృతి చెందారు. 89 ఏళ్ల ఆయన 2004 ఆగస్టు నుంచి 2005 నవంబర్ వరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

కాగా ఈ నెల మొదటి వారంలో మరో బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గతంలోనూ గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ వ్యాఖ్యలు చేసి ప్రగ్యాసింగ్ వివాదాస్పద నాయకురాలిగా నిలిచారు.