తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ త్రిసభ్య సంఘం

తెలంగాణ అసెంబ్లీకి జరుగనున్న ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. 40 మంది పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించి వారితో ఎన్నికల వ్యూహంపై గంటన్నర సేపు సమాలోచనలు జరిపారు.  కలసి వచ్చే పార్టీలతో పొత్తులు, అభ్యర్ధుల ఎంపిక కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్‌ అలీ, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, సంపత్‌ తదితరులతో భేటీ అయిన తెలంగాణ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపికపైనా చర్చించారు.

త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా భక్త చరణ్‌దాస్‌ను నియమించారు. కమిటీ సభ్యులుగా జ్యోతిమణి సెన్నిమలై, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరికి పలుకుబడి ఉంది..? ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపితే గెలుస్తారు? ఏయే సీట్లు పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఇవ్వాలి.? అనే విషయాలపై నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ కమిటీ ఓ నివేదికను తయారు చేసి అధిష్ఠానికి పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతే అధిష్ఠానం అభ్యర్ధుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. కచ్చితంగా గెలిచే సీట్ల విషయంలో రాజీపడొద్దని నేతలకు ఆదేశించారు. పొత్తు, అభ్యర్థుల విషయంలో ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ఇన్‌ఛార్జితో గానీ తనతో గానీ నేరుగా మాట్లడవచ్చని రాహుల్‌ వారికి తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలకు కాంగ్రెస్ కండువా కప్పి రాహుల్ గాంధీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ భేటిలో  కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ, కోదండరాం పార్టీ, సీపీఐ పార్టీల సీట్ల పంపకంపై ఇంకా కొలిక్కిరాలేదు. ఆయా పార్టీలు ఏ సీట్లను ఆశిస్తున్నాయనే అంశంపై నిశితంగా చర్చించి ఆ తర్వాత తుది జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ కీలక నేతలు, త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌కు రాగానే ఈ వ్యవహారంపై చర్చించనున్నారు.

కాగా,  రాహుల్‌ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకంగా చర్చించడం జరిగింది. " కచ్చితంగా ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని రాహుల్ చెప్పారు. గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగులు, దళితుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను రాష్ట్రంలో గెలిపించండని రాహుల్ వివరించారు” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటి తర్వాత తెలిపారు.

 ఎన్నికల వరకు అభ్యర్థుల విషయాలను బయట ఎవరూ మాట్లాడొద్దని రాహుల్ సూచించారని, గ్రూపులకు అతీతంగా పార్టీలో అందరం కలిసి పనిచేయాలని నేతలంతా నిర్ణయం తీసుకున్నామని పెర్కొన్నారు. ప్రాంతాలవారీగా తాజా పరిస్థితిని రాహుల్‌కు వివరించాని అంటూ మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి, యువకులకు టికెట్లు ఇవ్వాలని రాహుల్‌ను కోరామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థుల సీట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టంగా చెప్పారని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి స్పష్టం చేసారు. తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించాలని మేం ఆయనకు నిశితంగా వివరించామని పేర్కొన్నారు.