ఇంటిపేరుతో విజయం రాదు.. వ్యక్తిగత సామర్ధ్యం అవసరం

విజయం అనేది ఇంటిపేరుతో రాదని.. వ్యక్తిగత సామర్థ్యం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోచిలో మళయాల మనోరమ మీడియా కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రధాని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తూ ఐదేళ్ల క్రితం వరకు ప్రజల ఆకాంక్షలకు విలువ లేకుండా ఉండేదని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. 

‘ఇప్పుడు దేశంలో వ్యక్తి ఎవరైనా సరే, ఎంతటి హోదాలో ఉన్నా సరే అవినీతికి పాల్పడం ఆమోదయోగ్యం కాదు. అది ఎప్పటికీ ఒక అవకాశం కాకూడదు. పోటీతత్వమే మన విధానం. నేటి భారతంలో కొంతమంది గొంతుక మాత్రమే వినిపించడం కాదు.. దేశంలోని 130కోట్ల మంది గళం వినిపించే అవకాశం ఉంది' అని తెలిపారు. 

ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలకు అవకాశం ఉండాలని మోదీ హితవు చెప్పారు. ప్రజాజీవితంలో వ్యక్తులు, సంస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు.  మీడియాకు సంబంధించినంతవరకూ ప్రతి భారతీయుడి అభిప్రాయాలను వినడం ఎంతో ముఖ్యం అని చెప్పారు.

 ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరూ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. కానీ ఐదేళ్ల క్రితం ఇలా లేదని, అప్పట్లో ప్రజలు మనం ఏమైనా చేయగలమా అని అనుకునేవారని గుర్తు చేశారు. అవినీతిని రూపుమాపగలమా అని పరస్పరం అభిప్రాయపడేవారని చెప్పారు. 

కానీ నేడు.. చేయగలమా అన్న పరిస్థితి నుంచి మనం చేయగలం అనే స్థితికి చేరుకున్నామని మోదీ తెలిపారు. ‘నువ్వు పెద్ద కుటుంబం నుంచి వచ్చావా లేదా పెద్ద నగరాలు, పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నావా అనే దానిపై ఆధారపడి విజయం సిద్ధించదు. వ్యక్తిగత సామర్థ్యం, సాధించాలనే సంకల్పం, కష్టపడే తత్త్వంతోనే అన్ని సాధ్యమవుతాయి’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. 

దేశానికి అవినీతి నుంచి విముక్తి కల్పిస్తామని, స్వచ్ఛభారత్‌ను నిర్మిస్తామని ప్రధాని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. సుపరిపాలనను ప్రజా ఉద్యమంగా మారుస్తామని స్పష్టం చేశారు.