అమరావతిలో రూ 35 వేల కోట్ల టెండర్లు రద్దు

డబ్బులున్న మేరకే రాజధాని అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తామని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిఆర్‌డిఎ, రాజధానిలో పనులు తదితర అంశాలపై జరిపిన సమీక్షా సమావేశంలో రాజధాని పరిధిలో దాదాపు రూ 35 వేల కోట్లతో చేపట్టిన వివిధ పనులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎటువంటి ఒప్పందాలు లేకపోవడంతో  ఈ పనులకు సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని, తగినన్ని ఆర్థిక వనరులు సమకూరిన తరువాతే వీటిపై ముందుకెళ్లాలని నిర్ణయించారు. 

రాజధానిలో చేపట్టిన పనులు, వాటికి కేంద్రంతో పాటు వివిధ ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఇచ్చిన నిధులు, భవిష్యత్తులో ఎంత మొత్తం వచ్చే అవకాశం ఉంది తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆరా తీశారు. హడావిడిగా పనులు చేయవలసిన అవసరం లేదని, ఆర్థిక పరిస్థితులు ఆధారంగానే నిర్మాణాలపై ముందుకువెళ్ళాలిని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా ఈ తరహా చర్యలు తీసుకుందన్న అభిప్రాయం ప్రజల్లో కలగకగుండా జాగ్రత్త పడాలని నిర్ణయించారు. 

సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిలో ఇప్పటి వరకూ ప్రారంభంకాని రూ 35 వేల కోట్ల విలువైన టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల, మినిస్టర్ల, జడ్జీల, ఉద్యోగుల నివాస సముదాయాల్లో కొన్ని 40 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు అసలు ప్రారంభమేకాలేదని చెప్పారు. 

64 వేల మంది రైతులు రాజధానికి భూములిచ్చారని, అందులో 43వేల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, మిగిలిన వారికి ప్లాట్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు. రాజధానిలోని వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి రూ.2800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమరావతి నిర్మాణం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ కాదని, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయితే హడ్కో నుంచి రూ.2వేల కోట్లు, ఇతర బ్యాంకుల నుంచి రూ.2వేల కోట్లు ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని, దాంతో ఖర్చు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని రైతులకు శుక్రవారం నుంచి కౌలు చెల్లించనున్నట్లు చెప్పారు. రాజధాని ఏ ఒక్కరికో, ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.