సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మోదీ వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. 

భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబర్‌ 27న రాత్రి 07:30 గంటల నుంచి 08:00 గంటల వరకు మోదీ ప్రసంగించనున్నారని యూఎన్‌ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ద్వారా తెలుస్తోంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అదేరోజు అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఉంది. సమావేశం నుంచి కొందరు నాయకులు తప్పుకుంటే ఇమ్రాన్‌ ఖాన్‌కు నిర్ణీత సమయం కన్నా ముందే మాట్లాడే అవకాశం లభిస్తుంది.

ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రసంగంలో భారత్‌లో కశ్మీర్‌కు ఆర్టికల్‌370 రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని ఖండించడానికి భారత్‌ తన హక్కును ఉపయోగించుకుంటుందని భారత  ప్రతినిధులు తెలిపారు. 

ఐరాస సమావేశాల కోసం మోదీ సెప్టెంబర్‌ 23న న్యూయార్క్‌ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. ఆ తర్వాత యూఎన్‌జీఏ సమావేశంలో ప్రసంగించిన అనంతరం భారత్‌కు తిరిగి పయనమవుతారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ప్రపంచ స్థాయి నాయకులతో సమావేశం కానున్నారని సమాచారం.