ఫిట్‌నెస్‌.. మన జీవనవిధానం కావాలి

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

‘అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి' అని ప్రధాని పిలుపిచ్చారు. 

జీవితంలో వ్యాయామం, క్రీడలు ఒక భాగం కావాలి. క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. అలా ఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. దీన్ని నేటి యువతరం గుర్తించాలని సూచించారు. వ్యాయామం చేయాలని చెప్పడమే కాదు.. చేసి చూపించాలని పేర్కొన్నారు. 

నేటి కాలంలో సాంకేతికత పెరగడం వల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారని చెబుతూ కనీసం 2వేల అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉన్నదని విచారం వ్యక్తం చేశారు. దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారని గుర్తు చేశారు. 

ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతపై విస్తృత చర్చ జరగాలని, ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలని పిలుపిచ్చారు.  ఫిట్‌నెస్‌ ఆవశ్యకతపై వీడియో రూపొందించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిద్దామని సూచించారు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిద్దామని చెబుతూ ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్‌నెస్‌ కంటే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. 

విజయానికి ఎలివేటర్‌ ఉండదు.. మెట్లెక్కి చేరుకోవాల్సిందేనని  ప్రధాని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన వ్యక్తి.. ఆరోగ్యకరమైన కుటుంబం.. ఆరోగ్యకరమైన సమాజం.. నవ భారతాన్ని ఆరోగ్య భారతంగా తీర్చిదిద్దేందుకు మార్గాలివే అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను మరోసారి అభినందించారు. ఈ సందర్భంతా ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.