ఏపీలో 2024 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

ఏపీలో లో 2024 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ భరోసా వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ, వైసీపీల నుంచి భారీగా జరుగుతున్న వలసలే నిదర్శనమని కర్నూల్ లో తెలిపారు. టీడీపీ పాలనపై ప్రజలు విసుగుచెంది వైసిపిని అధికారంలోకి తీసుకువచ్చారని చెబుతూ ఆ పార్టీ కూడా కేవలం నాలుగు నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ధ్వజమెత్తారు. 

ఇక నాలుగు సంవత్సరాలు గడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. రాజధాని మార్పు విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఆ ప్రాంతంలోని ప్రజలు, రైతుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టత ఇవ్వాల్సి అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. 

గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.25 వేల కోట్లు మంజూరు చేశారని, అందులో అందులో రూ.9వేల కోట్లతో వివిధ భవనాలను నిర్మించారని వివరించారు. ఇంత ప్రజాధనంతో నిర్మించిన అమరావతి రాజధానిని మార్పు చేయాలని అనడం తగదని హితవు చెప్పారు. ప్రారంభించిన ఒక రాజధానిని ఇంత వరకు పూర్తి చేయలేదని, అలాంటప్పుడు మరిన్ని రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. 

బీజేపీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనాతీరుతో ముగ్ధులై ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారని కన్నా తెలిపారు. రాష్ట్రంలో జూలై 6 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై ఆగస్టు 20తో ముగిసిందని తెలిపారు. అయితే సభ్యత్వ నమోదు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని, సెప్టెంబర్ 11 నుంచి పార్టీ సంస్థగత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 

రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాలేదు కదా అని అయన వ్యాఖ్యానించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే అవకాశం లేదని కన్నా స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అంతకంటే ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 2014 నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. ఇన్ని నిధులు ఇచ్చిన కేంద్రం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే ఎందుకు ఇవ్వకుండా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 

వాస్తవ విషయాలను దాచిపెట్టి రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధామంత్రి నరేంద్రమోదీని దోషిగా వక్రీకరిస్తూ విషప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో రాష్ట్ర విభజన కచ్చితంగా జరుగుతుందని తెలిసినా రాజకీయ పార్టీలు సమైకాంధ్ర ఉద్యమం చేపట్టి ప్రజలను మోసం చేశాయని గుర్తు చేశారు. 

అలాకాకుండా పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై చర్చలో పాల్గొని ఉంటే విభజన సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు భద్రాచలం డివిజన్ రాష్ట్రంలో కలవడం వంటి అంశాలు తెలికగా జరిగేవని ఆయన వివరించారు. అప్పట్లో పార్లమెంటులో అన్ని పార్టీలు ఏకాతాటిపై ఉండి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చి ఉండేది కాదన్నారు.

రాజకీయ పార్టీలకు రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యమైపోయాదని దుయ్యబట్టారు. 2014 నుంచి రాష్ట్రంలో గ్రామీణ అభివృద్దికి సంబంధించి కేంద్రం రూ.24 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేయడం చేతకాక, తన చేతగానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై మోపి విషప్రచారం చేసిందని విమర్శించారు.