రెండు, మూడు నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

రాబోయే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. యువకులు ఎలాంటి వదంతులు నమ్మకుండా రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌పై త్వరలోనే కేంద్రం అతి పెద్ద ప్రకటన చేయనుందని తెలిపారు. 

నేతల నిర్బంధం గురించి ప్రజలు విచారించాల్సిన పని లేదని, ఇది వారి రాజకీయ జీవితానికి ఎంతో ఉపయుక్తం అవుతుందని చెప్పారు.  మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను తీవ్రవాదులు, పాకిస్తాన్‌ ఎక్కువగా వాడుతున్నందునే సమాచార వ్యవస్థను స్తంభింపజేయాల్సి వచ్చిందని తెలిపారు.  

 మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తీవ్రవాదులు, పాకిస్తాన్‌ ఈ సేవలను ఎక్కువగా వాడుతున్నాయని,  అందుకే వీటిని నిలిపివేశామని గవర్నర్ సమర్ధించుకున్నారు. కుప్వారా, హంద్వారా జిల్లాల్లో (కశ్మీర్) ఇప్పటికే మొబైల్ ఫోన్స్ కనెక్టివిటీని పునరుద్ధరించామని, త్వరలోనే ఇతర జిల్లాలకూ దీన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. 

కశ్మీర్‌లో ప్రతీ పౌరుడి ప్రాణాలు తమకెంతో విలువైనవని స్పష్టం చేస్తూ,  ఇంతవరకూ ఒక్క పౌరుడు కూడా మృతిచెందలేదని చెప్పారు. 

అయితే, చెదురుమదురు హింసాత్మక ఘటనల్లో కొద్దిమంది గాయపడినా, అవి చాలా స్వల్పగాయాలేనని తెలిపారు. 370 అధికరణ రద్దు తప్పనిసరి అని, జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేదని భరోసా ఇచ్చారు. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా అది తాత్కాలికమేనని, రాబోయే నెలల్లో రాష్ట్రంలో భారీ అభివృద్ధి చోటుచేసుకోవడం అంతా చూస్తారని గవర్నర్ ప్రకటించారు.