నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు

చంద్రబాబుకు పంపిన కోర్ట్ నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. 2010 నాటి కేసుకు సంబంధించి బీజేపీపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు.

ఏం జరిగినా టీడీపీ నేతలు కేంద్రానికి ఆపాదిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని,  తామే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి నిధుల కేటాయింపులో అన్యాయం జరగడం లేదని, అయితే సాంకేతిక అంశాలతో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

కాగా, చంద్రబాబుకు నోటీసులు వెనుక మోదీ ఉన్నారనేది అవాస్తవమని ఏపీ బీజేపీ రాష్ట్ర కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 2013 నుంచి కేసు నడుస్తోందని, అప్పటి నుంచి వారికి నోటీస్‌లు వస్తున్నాయని చెప్పారు. 22 వాయిదాలు గైర్హాజరవ్వడంవల్లే వారెంట్‌ వచ్చిందని పేర్కొన్నారు.

కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్‌ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు.